అమర్ నాథ్ గుహ సమీపంలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు అనేకమంది భక్తులు కొట్టుకుపోయారు. అందులో కొందరి ఆచూకీ ఇంత వరకు లభించలేదు. గల్లంతైన 40 మందిని గుర్తించేందుకు శనివారం రాత్రి కూడా సహాయక చర్యలు కొనసాగాయి. శుక్రవారం గుహ సమీపంలో కురిసిన వర్షానికి ఒక్కసారిగా వరద రావడం, ఆ మార్గంలో వెళుతున్న భక్తులు కొట్టుకుపోయారు. అక్కడి పరిస్థితిని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తు కారణంగా ఇప్పటికే 16 మంది మరణించగా, 105 మంది గాయపడ్డారు.
దీనిపై అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. సుమారు 15 వేలకు పైగా భక్తులను పంజ్ తార్ని లోని లోయర్ బేస్ క్యాంప్ కు తరలించింది. బురద, రాళ్ల శిధిలాల కింద చాలా మంది చిక్కుకుపోయి ఉంటారన్న ఆందోళనలతో.. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అక్కడి తాజా పరిస్థితిని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సమీక్షించారు. గాయపడిన వారిని హెలికాప్టర్లతో శ్రీనగర్ లోని స్కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా వుంటే.. అమర్ నాధ్ యాత్రలో మిస్సైన వారిలో విజయవాడకు చెందిన వినోద్ అశోక్ సురక్షితంగా వున్నారు. తాను సురక్షితంగానే ఉన్నానని ఏపీ భవన్ అధికారులకు సమాచారమిచ్చాడు వినోద్. ప్రస్తుతం వైష్ణోదేవీ ఆలయం సమీపంలోని కాట్రా వద్ద ఉన్న వినోద్ తమ క్షేమ సమాచారం అందించారు. ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో నిన్న ఎవరినీ కాంటాక్ట్ చేయలేకపోయానని వినోద్ తెలిపారు. ఇటు గుంటూరు నుంచి అమరనాథ్ యాత్రలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీ సురక్షితంగా వున్నారు. విజయవాడ నుంచి వచ్చిన 34 మంది అమర్‌నాథ్ యాత్రికుల బృందం క్షేమంగా వుందని ఢిల్లీలోని ఏపీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కాట్రా వద్ద సురక్షితంగా ఉన్న 34 మంది విజయవాడకు చెందిన యాత్రికుల సమాచారం వారు తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు చండీఘర్ నుంచి రైలులో విజయవాడ కు బయల్దేరనున్నారు 34 మంది యాత్రికులు. ఈ యాత్రికులకు ప్రయాణ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం.