Site icon NTV Telugu

YS Jagan: ఎవ్వరికీ రక్షణ, భద్రత లేదు.. రాష్ట్రంలో అత్యంత భయానక పరిస్థితులు..!

Ys Jagan

Ys Jagan

YS Jagan: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై సోషల్‌ మీడియాలో వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు జగన్‌.

Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు..

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మ‌ద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్‌ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్‌తో దాడిచేయిస్తారా? అని ప్రశ్నించారు జగన్.. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది? అని నిలదీశారు.. మరోవైపు రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం ఒక పరిపాటిగా మారింది. వైఎస్‌ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైయస్ఆర్ సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు. లంచం ఇవ్వలేదని లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Virat Kohli In Trouble: విరాట్ కోహ్లీపై ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

చంద్రబాబు ఏడాదిపాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది అక్రమకేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా? అని ప్రశ్నించారు జగన్‌.. ప్రజాసమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్ఆర్ సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్‌నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో మోది చంపేశారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా? అలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్‌ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా? అని సూచించారు జగన్.

Read Also: PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు గుర్రాకులపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం అన్నారు జగన్.. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదుకూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికారపార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక తండ్రిలేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది. ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు. చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందినవారని ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు కేవలం పాలనమాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీకూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబు మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌..

Exit mobile version