YS Jagan: గల్ఫ్‌లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను వెంటనే వెనక్కి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మధ్య పాశ్చ్య దేశాల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జగన్.. గల్ఫ్ దేశాల్లో వేలాది మంది ఆంధ్రులు ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరుక్కుపోయారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. గల్ఫ్ దేశాల్లో వేలాది మంది ఆంధ్రులు ఉపాధి కోసం పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల వారి భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొన్నదన్నారు. విమాన సర్వీసుల రద్దు, విమానాశ్రయాల్లో ఆంక్షలు విధించడంతో అనేక మంది అక్కడికక్కడే ఇరుక్కుపోయారని తెలిపారు.
Read Also: Bollywood : చేతులు కాలుతోన్న మలయాళ రీమేక్స్ మోజులో బాలీవుడ్
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్. అవసరమైతే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి ప్రవాసాంధ్రులను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని సూచించారు. అలాగే గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, రాష్ట్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించాలని కోరారు. అక్కడి పరిస్థితులపై వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రవాస ఆంధ్రుల భద్రత మరియు సురక్షిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యంగా ఉండాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..