TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..

Tdp Janasena Seat Sharing T

Tdp Janasena Seat Sharing T

TDP-Janasena Seat Sharing Talks: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చింది.. అయితే, కూటమిలో ఇప్పటి వరకు సీట్లపై ఓ నిర్ణయానికి రాలేదు నేతలు.. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన చర్చల పురోగతిని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన కార్యాలయానికి వెళ్లారు. పవన్ కల్యాణ్‌తో చర్చించి, సీట్ల సర్దుబాటుపై ఆయన అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఇక, పవన్ కల్యాణ్‌తో చర్చలు ముగిసిన అనంతరం నాదెండ్ల మనోహర్ తిరిగి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. జనసేన అధినేతతో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలపై చర్చలు కొలిక్కి వచ్చిన తర్వాత బీజేపీతో సీట్ల సర్దుబాటు అంశంపై టీడీపీ చర్చలు జరపనున్నట్లు సమాచారం. దీంతో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఉత్కంఠ నెలకొంది. జనసేనకు కేటాయించే స్థానాలు, తదుపరి బీజేపీతో జరిపే చర్చలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే, 6 కార్పొరేషన్లతో పాటు.. 40 మున్సిపాలిటీలు కోరుతుందట జనసేన పార్టీ.. పార్టీ చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌తో చర్చల అనంతరం మళ్లీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చర్చలకు సీఎం చంద్రబాబు దగ్గరకు రావడంతో.. కాసేపట్లో ఏదో ఒకటి ఫైనల్‌ కావడం ఖాయమనే చర్చ సాగుతోంది..