Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆది, సోమవారాల్లో సెలవు రోజులైనా కూడా పనిచేశాయి. 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 30, 31 చివరి రోజులు కావటంతో ఈ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సిబ్బంది ఉగాది పండుగ, రంజాన్ పండుగ రెండు రోజులు కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లును నిర్వహించారు. శనివారం అమావాస్య కావటంతో ఆదివారం ఉగాది పండుగ రోజు కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక సోమవారం రంజాన్ పండుగ రోజు కూడా స్వల్ప సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఉగాది పండుగ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 8 కోట్ల రూపాయల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరింది. ఇందులో 2 కోట్ల ఆదాయం గుంటూరు జిల్లా నుంచి వచ్చింది. సాధారణ రోజుల్లో రోజుకు 30 కోట్లకుపైగా ఆదాయం ప్రభుత్వానికి ప్రతి రోజు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వస్తుంది. అయితే, ఆ మేర ఆదాయం రాకపోయినప్పటికీ సెలవు రోజుల్లో కొంత మేరకు ఆదాయం వచ్చినట్టైంది. రెండో రోజున కూడా ఇదే విధంగా 8 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజులుకావటంతో టాక్స్ రిటర్న్ లో ఆదాయాలు, ఆస్తుల వివరాలు చూపించే వారు రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి వెసులుబాటు కూడా ఈ రెండు రోజులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే, రెండు రోజుల్లో కలిపి.. మొత్తంగా రూ.10 కోట్ల మేర ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది.. సాయంత్రం వరకు రూ.10.90 కోట్ల ఆదాయం వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. పూర్తిస్థాయి లెక్కలు తేలే సరికి మరికొంత ఆదయాం సమకూరే అవకాశం ఉందంటున్నారు.. మొత్తంగా.. సెలవు రోజుల్లో పనిచేయడంతో రూ.10.90 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది..