Somu Veerraju: జగన్‌కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్

Somu Veerraju

Somu Veerraju

Somu Veerraju: తిరుపతిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీవీతో మాట్లాడుతూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆరోపించారు. 2029 ఎన్నికల్లో జగన్ ప్రజలకు ఏమి చెప్పి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు. “మావిగన్ గురించి చర్చిద్దాం రా జగన్” అంటూ వ్యాఖ్యానించిన ఆయన, అది “మావిగన్ కాదు.. మాయగాన్, అబద్ధాల గన్” అంటూ ఎద్దేవా చేశారు. జగన్ చెప్పే ప్రతి మాట అబద్ధమేనని ఆరోపించారు.

రాజధాని అంశాన్ని ప్రస్తావించిన సోము వీర్రాజు, మొదట అమరావతిలో ఇల్లు కట్టుకుంటానని చెప్పిన జగన్, తర్వాత మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. చివరకు అమరావతిలో ఇల్లు కూడా కట్టలేదని, మూడు రాజధానులు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. రాజధాని అభివృద్ధికి తన పాలనలో ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం, ఇసుక, గ్రావెల్, భూముల వ్యవహారాల్లో అవినీతి జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలన మొత్తం అవినీతిమయంగా మారిందని విమర్శించారు.

ప్రస్తుతం వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయని, అలాంటి పరిస్థితిలో బలం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు సోమువీర్రాజు.. రానున్న ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన హామీలు, ప్రజలను మోసం చేసిన అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంటుందని, అదే అమరావతి అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిపైనే ప్రభుత్వం ముందుకు సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.