Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani

Perni Nani

Perni Nani: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏ రంగంలో దొంగలు ఉన్నా జరిగే నష్టం కంటే.. గురువుల్లో అక్రమాలకు పాల్పడేవారు ఉంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయుల్లో అక్రమాలు జరిగితే భవిష్యత్తు సమాజానికే ప్రమాదమని వ్యాఖ్యానించారు. విద్యాశాఖను మంత్రి నారా లోకేష్ కావాలనే తీసుకున్నారని, విద్యావ్యవస్థలో అక్రమాలకు పాల్పడే వారిని ప్రోత్సహించారని పేర్ని నాని ఆరోపించారు. స్కామ్‌లు చేసి డబ్బులు సంపాదించేందుకే విద్యాశాఖను తీసుకున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారనే కారణంతో తమకు అనుకూలమైన వారిని టీచర్లుగా నియమించారని ఆరోపించారు.

అన్ని శాఖల్లోనూ లోకేష్ పెత్తనం కొనసాగుతోందని, రాష్ట్రంలో సంపాదించిన డబ్బును విదేశాల్లో దాచుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు. లోకేష్ నెలకోసారి విదేశాలకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. తనతో చర్చకు వస్తానని సవాల్ చేసిన లోకేష్.. తాను ఆధారాలతో వస్తుంటే చర్చ నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. డీఎస్సీ స్కామ్‌కు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని పేర్ని నాని అన్నారు. నిన్నటి వరకు ప్రగల్భాలు పలికిన లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ‘డీఎస్సీ అంటే టీడీపీ’ అని గతంలో చెప్పారని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే మీ డీఎస్సీనా అని నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలోనే కాకుండా వికలాంగుల కోటాలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఓసీ, బీసీ కేటగిరీల్లోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయని చెప్పారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు ఇచ్చారని, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారికి కూడా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

పదుల సంఖ్యలో ఫేక్ టీచర్లు?
ఒక్కరు, ఇద్దరు కాకుండా పదుల సంఖ్యలో నకిలీ ఉపాధ్యాయులు బయటపడుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇక చర్చలతో కాలయాపన చేయకుండా సమగ్ర విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆధారాలతో అక్రమాలు బయటపడిన తర్వాత కూడా చర్చలు ఎందుకని ప్రశ్నించారు. అంతేకాదు.. విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. చర్చల అంకం ముగిసిందని, ఇక విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణ.. ఈ రెండు డిమాండ్లు నెరవేరే వరకు తమ ఉద్యమం ఆగదని పేర్ని నాని హెచ్చరించారు.