Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: అమరావతిలోని మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు. ప్రతి కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండేలా రూపకల్పన చేశారు. సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు, మహిళా నేతలకు ఈ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

అలాగే 2014 నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులతో పాటు ఇద్దరు సాధక్‌లకు కూడా కమిటీల్లో స్థానం కల్పించనున్నారు. ప్రతి కమిటీకి 10 నుంచి 25 మంది సాధక్‌లు సమన్వయ బృందంగా సహకరించేలా వ్యవస్థ రూపొందిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ కమిటీల్లో చోటు పొందాలనుకునే నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు మరియు పత్రాలను ఈ కమిటీలు స్వీకరించనున్నాయి. అనంతరం వాటిని పరిశీలించి సమగ్ర నివేదిక రూపంలో పవన్ కల్యాణ్‌కు అందజేయనున్నారు. ఈ నివేదికలను పవన్ కల్యాణ్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ పరిశీలించిన తరువాత నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, కమిటీల సభ్యుల నియామకాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్‌.. పార్టీ నేతలకు ఆదేశించినట్లు సమాచారం.