Minister Nimmala Ramanaidu: విధ్వంసకారుడే విధ్వంసం గురించి, విధ్వంసానికి నిర్వచనం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి నిమ్మల రామానాయుడు. దుష్టపాలన, తుగ్లక్ పాలనకు బదులుగా.. జగన్ పాలన అని ప్రజలు ఉదహరించుకున్నారు. జగన్ ఐదేళ్ల రివర్స్ పాలన చూసి దేశంలోని రాష్ట్రాలే కాదు, ప్రపంచదేశాలే నివ్వెర పోయాయన్నారు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్దకమైందని.., డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని.. ఫలితంగా ఇవాళ వెయ్యి కోట్లు అదనపు వ్యయం అవుతుందన్నారు.. ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎత్తును 41.15 మీటర్లు అని చెప్పి అణువణువునా అన్యాయం చేసింది వైఎస్ జగన్ కాదా? అని నిలదీశారు రామానాయుడు.
Read Also: CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు భారీ ఊరట..
చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన జగన్ పై ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా జగన్ అరాచక పాలనలో ఎక్కడి పనులు అక్కడే బంద్ అయ్యాయని విమర్శించారు.. ఎవరి డబ్బులు, ఎవరికి బటన్ నొక్కావు, అప్పులు తెచ్చావు, అడ్డదారులు తొక్కావు. బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే, ప్రజలు నీకు ఎందుకు బ్రహ్మరధం పట్టలేదు..? అని ప్రశ్నించారు.. నీ ఘోర పరాజయానికి, రాజకీయ పతనానికి కారణాలు విశ్లేషించుకో అని సలహా ఇచ్చారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, పాలనా పరిపక్వత ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ మేలు కలయికకు విజయం ఆంధ్రుల నిర్ణయం. వీరిపై విమర్శలు చేస్తే ఆంధ్రులపై చేసినట్లే అని వ్యాఖ్యానించారు మంత్రి నిమ్మల రామానాయుడు..