Minister Kolusu Parthasarathy: మంత్రి కొలుసు పార్థసారథి కొత్త ఛాంబర్‌లోకి మారారు.. సచివాలయంలోని బ్లాక్ 4లో ఫస్ట్ ఫ్లోర్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు మంత్రి పార్థసారథి.. ఇప్పటి వరకు తన ఛాంబర్ పనులు పూర్తి కాకపోవడంతో తాత్కాలిక ఛాంబర్‌లోనే విధులు నిర్వహిస్తూ వచ్చారు మంత్రి కొలుసు.. ఇక, పనులు పూర్తి కావడంతో.. ఇప్పుడు కొత్త ఛాంబర్‌లోకి మారారు.. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు.. ఉద్యోగులు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు..
ఇక, సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పరిపాలనలో చేసిన తప్పులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చక్కదిద్దుతున్నారని తెలిపారు.. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా.. ఎన్నికల హామీలను అమలు చేయడానికి చిత్తశుద్దితో పని చేస్తున్నాం అన్నారు.. గత ప్రభుత్వం అవినీతిలో విప్లవం సృష్టించింది అంటూ ఎద్దేవా చేశారు.. అత్తారింటికి దారేదీ తరహాలో రాష్ట్రంలోని సంపద అంతా తన ఇంటికి వచ్చేలా గత పాలకులు ప్రణాళికలు రచించుకున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు.. గత ప్రభుత్వం రూ.4,500 కోట్ల మేర గృహ నిర్మాణ రంగం నిధులను దారి మళ్లించి పేదలకు అన్యాయం చేసిందంటూ మండిపడ్డారు మంత్రి కొలుసు పార్థసారథి.. మరోవైపు.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పార్థసారథి.. ప్రజలు, రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో.. గత ప్రభుత్వం హయాంలో ఎగవేసిన డబ్బులను సైతం మా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.