NTV Telugu Site icon

Very Heavy Rains in AP: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో సెలవు

Rains

Rains

Very Heavy Rains in AP: తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. నేడు మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది తుఫాన్‌గా మారి.. ఎల్లుండి తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావం ఉంటుందని సమాచారం.

Read Also: Puneet Superstar: రీల్స్ కోసం ఇంత హంగామా అవసరమా..? గేదె మూత్రం, పేడతో ఏకంగా..(వీడియో)

ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం తుపానుగా మారనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లాలో స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో తుఫాన్‌ పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా మారి పుదుచ్చేరి – చెన్నై మధ్య తీరం దాటుతుందని IMD అంచనా వేస్తోంది.. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయల సీమ జిల్లాలకు రేపు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. మరో నాలుగు రోజుల పాటు వీటి ప్రభావం కొనసాగుతోందని పేర్కొంది..

Read Also: Chandrababu Naidu: ఎలక్ట్రానిక్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి..

భారీ వర్షాల నేపథ్యంలో.. నేడు, రేపు పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు ప్రకటించారు తిరుపతి, చిత్తూరు జిల్లా కలెక్టర్లు.. మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ సెలవుగా ప్రకటించింది ప్రభుత్వం.. నెల్లూరులో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోజు సెలవుగా ప్రకటించారు.. ఇక వర్షాల నేపథ్యంలో.. శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 15, 16, 17 తేదీలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ టీఎస్ చేతన్.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం .. బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. తదుపరి 2 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుంది.. దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా,రాయలసీమలో విస్తృతంగా వర్షాలు.. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు.. పలుచోట్ల అతితీవ్రభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉండగా.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.. నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. మిగత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.