Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: దేవాలయాల పరిరక్షణపై పవన్‌ కీలక వ్యాఖ్యలు..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: దేవాలయాల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయన్నారు. నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read Also: Janasena: తెలంగాణలో ఖాతా తెరిచిన జనసేన.. ఏ జిల్లాలో గెలిచిందంటే..?

నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు పవన్‌ కల్యాణ్‌.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఆలయాలు నాగరికతకు చిహ్నాలు అన్నారు. మన కళలు, మన వారసత్వం, మన సంస్కృతి, ధర్మ పరిరక్షణ ఆలయాలతో ముడిపడి ఉన్నాయి. అరుణాచలంలో గిరిప్రదక్షణ చేస్తారు అని తెలుసు.. నాకు గిరిప్రదక్షణ చేయాలని చాలా కోరిక ఉంది. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు, భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటాన్నారు.. శివరాత్రికి రెండు రోజుల ముందు ఈ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు పవన్.. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసిందన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నాం అన్నారు. నిరాదరణకు గురైన ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని.. భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు పవన్‌ కల్యాణ్‌..

శివరాత్రి తర్వాత గిరిప్రదక్షణ మార్గంలో మొక్కలు నాటుతామని.. శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రూ. 10 కోట్లు వెచ్చించి సిమెంటు రోడ్డు నిర్మించామన్నారు పవన్‌ కల్యాణ్‌.. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షణ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు.. అటవీ శాఖ ఆధ్వర్యంలో గిరిప్రదక్షణ మార్గానికి ఇరు వైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం అన్నారు.. శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ ద్వారా ప్రతి భక్తుడికి కైలాసగిరి ప్రదక్షణ చేసిన ఫుణ్యఫలం దక్కాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version