Deputy CM Pawan Kalyan: ప్రపంచ కప్ విజేతలుగా భారత్‌కు గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును సన్మానించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న ఈ మహిళా క్రీడాకారిణులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున చెక్కులు, కోచ్‌లకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ప్రతి మహిళా క్రికెటర్‌కు పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులు అందించి ఘనంగా సత్కరించారు.
Read Also: CM Chandrababu: రూ.13లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి !
అంధ మహిళా క్రికెటర్లు సాధించిన ఈ విజయం దేశానికే గర్వకారణమని ఈ సందర్భంగా ప్రశంసించారు పవన్ కల్యాణ్.. వారి ప్రాక్టీస్ కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం క్రీడలను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తోందని, జట్టు ప్రతినిధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రపంచ కప్ విజేతల జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెటర్లు.. దీపిక (జట్టు కెప్టెన్), పాంగి కరుణా కుమారి ఉన్నందుకు ప్రత్యేకంగా అభినందించారు. సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామంలోని సమస్యలను పవన్ కల్యాణ్‌కు వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని తంబలహట్టి తండాకు రహదారి అవసరమని ఆమె చెప్పగా, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణ కుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..