Site icon NTV Telugu

Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌.. వారిపై యాక్షన్‌ తప్పదు..!

Cbn

Cbn

Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రైవేట్ ఆలయ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమాయకుల ప్రాణాలు పోయాయి.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూనే, భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.. కాశీబుగ్గలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం… ప్రాణం చాలా విలువైనది. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. బాధ్యులైన వారిపై చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు.

Read Also: Pakistan: పాక్‌లో “గుర్తుతెలియని వ్యక్తుల” హల్చల్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖతం..

ఇక, ప్రైవేట్ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించి, నిర్వహిస్తున్న దేవాలయం.. ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం దురదృష్టకరం అన్నారు.. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. కానీ, ఆలయ నిర్వాహకులు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. పోలీస్ బందోబస్తు కూడా లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత దారుణం అన్నారు.. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని.. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను, ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. గాయపడినవారికి మెరుగైన సత్వర చికిత్స అందించాలని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

నిండు ప్రాణాలు పోయాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలు, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారించి భద్రతా నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

Exit mobile version