CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో వెలువడుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా కొనసాగుతోంది.. ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, సాయంత్రానికి మరింత స్పష్టత వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను మెచ్చి ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ తన ప్రధాన ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రజల సమస్యలను పరిష్కరించాలా? అంటే తాను ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అనునిత్యం పనిచేస్తున్నామని, ప్రభుత్వ పనితీరును గమనించే ప్రజలు కూటమికి మద్దతుగా ఓటు వేశారని చెప్పారు. ముఖ్యంగా గత మూడు రోజులుగా తుపాను సహాయక చర్యలపైనే రాత్రింబవళ్లు పనిచేశానని వెల్లడించారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపడుతున్నామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే నీటిని అందించామని గుర్తుచేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. గతంలో రోడ్లను ధ్వంసం చేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరించేశామని తాము చెప్పడం లేదని అన్నారు. గత ప్రభుత్వ పాలన నుంచి వారసత్వంగా వచ్చిన సమస్యలు ఇంకా ఉన్నాయని అంగీకరించారు. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని, ప్రజలకు సేవలందించే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకుంటున్నామని చెప్పారు.
ప్రజలు మెచ్చే పాలన అందించడమే తమ లక్ష్యమని, ప్రజల ఇబ్బందులను దూరం చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంచి పాలన అందిస్తున్నామనే నమ్మకం, విశ్వసనీయత ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్నాయని అన్నారు. రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు వేర్వేరుగా ఉంటాయని, అధికార పార్టీకి ఓటు వేయని వారు కూడా ఉంటారని చెప్పారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలోనూ విమర్శించే వారు, ఎగతాళి చేసే వారు ఉంటారని వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక, రాబోయే రోజుల్లోనూ ప్రజలు ఇదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత మెరుగైన పాలన అందిస్తామని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

