CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్‌ క్లాస్..!

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై ఉన్నతాధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను ప్రశ్నించిన సీఎం, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ అధికారులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 31 కొత్త పోస్టులను మంజూరు చేసినట్లు సీఎం గుర్తు చేశారు. త్వరలోనే మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోపు సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రత్యేక సిబ్బంది నియామకానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇక, డీఎస్సీ నియామకాల అంశంపై వైసీపీ చేస్తున్న విమర్శలను మంత్రులు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు… ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే వాస్తవాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ విమర్శలు చేస్తోందని, వాటికి సమర్థవంతంగా కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రులకు సూచించినట్లు సమాచారం. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ వరకు రెండు వారాల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మంత్రులు ఏ జిల్లాలో ఉన్నా ప్రభుత్వ పథకాల ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

×
×
Ad