CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.

Babu

Babu

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమికి అద్భుతమైన తీర్పు ఇచ్చారని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన గుర్తింపుగా ఈ ఫలితాలను అభివర్ణించారు. అర్బన్, రూరల్ ఓటర్లతో పాటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ కూటమికి మంచి మద్దతు లభించిందని తెలిపారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థాయిల్లోనూ కూటమి మంచి ఫలితాలు సాధించిందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో 96.42 శాతం, ఎంపీపీ ఎన్నికల్లో 93.15 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని చంద్రబాబు వెల్లడించారు. కూటమి ఓటు బ్యాంకు 3.6 శాతం పెరిగిందని, వైసీపీ ఓటు బ్యాంకు 6.25 శాతం తగ్గిందని పేర్కొన్నారు. రెండేళ్ల కూటమి పాలనకు ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు.

కూటమిలో సమన్వయం, క్రమశిక్షణకు ప్రాధాన్యం
కూటమి ఐక్యత కొనసాగాలంటే నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పరస్పరం సంప్రదింపులు జరిపి అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేశామని, ఎన్నికల సమయంలో రియల్ టైమ్‌లో సమన్వయం చేసుకున్నామని వివరించారు. మిత్రపక్షాలతోనూ ఇదే స్థాయిలో సమన్వయం కొనసాగించామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీకి చేసిన సేవలు, సీనియారిటీ, అనుభవం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. టీడీపీ నాయకత్వ ఎంపికకు ప్రత్యేక విధానాన్ని రూపొందించామని వెల్లడించారు. అభ్యర్థుల విద్యార్హతలు, వ్యక్తిగత ప్రవర్తన, పార్టీతో అనుబంధం, అంకితభావం, వయసు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. విద్యతో పాటు వ్యక్తిత్వం, నైతిక విలువలు కూడా ఉండాలని, పార్టీ భవిష్యత్తు కోసం కొత్త నాయకత్వాన్ని తయారు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థుల ఎంపిక
అభ్యర్థుల ఎంపికలో క్షేత్రస్థాయి కమిటీల సిఫార్సులకు ప్రాధాన్యం ఇచ్చామని చంద్రబాబు వివరించారు. బూత్ కమిటీల నుంచి జిల్లా స్థాయి వరకు అభిప్రాయాలు సేకరించామని చెప్పారు. కుటుంబ సాధికార సభ్యుల సిఫార్సులతో పాటు పంచాయతీ, యూనిట్, క్లస్టర్, మండల కమిటీల అభిప్రాయాలను పరిశీలించామని తెలిపారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. 175 నియోజకవర్గాలకు ప్రత్యేక పరిశీలకులను నియమించామని, జిల్లా స్థాయిలో నలుగురు సభ్యులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. కూటమి భాగస్వామ్య పార్టీలతోనూ చర్చలు జరిపి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామన్నారు.

డిజిటల్ విధానంలో అభ్యర్థుల ఎంపిక
అభ్యర్థుల ఎంపికలో డిజిటల్ విధానాన్ని కూడా ఉపయోగించామని చంద్రబాబు తెలిపారు. గత ఎన్నికల డేటా ఆధారంగా అభ్యర్థుల ప్రొఫైల్స్ రూపొందించామని, ‘మై టీడీపీ’ యాప్ ద్వారా సేకరించిన వివరాలను పరిశీలించామని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో నాయకుల పనితీరును విశ్లేషించి, పార్టీకి చేసిన సేవల ఆధారంగా రేటింగ్ ఇచ్చామన్నారు. అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న ఆదరణ తెలుసుకునేందుకు ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించామని వెల్లడించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక, కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి మూలస్తంభాలని పేర్కొన్నారు. పార్టీ లేకపోతే నాయకులు ఉండరని, కార్యకర్తలు లేకపోతే పార్టీ ఉండదని వ్యాఖ్యానించారు. నాయకులు, కార్యకర్తల మధ్య అనుసంధానానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నిరంతరం కొత్త నాయకత్వాన్ని తయారు చేసే ప్రక్రియ కొనసాగుతుందని, కార్యకర్తల సంక్షేమం, పార్టీ అభివృద్ధి తమకు ముఖ్యమని తెలిపారు. ‘జై కార్యకర్త’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

40 ఏళ్లుగా టీడీపీకి బీసీలే కంచుకోట
గత 40 ఏళ్లుగా బీసీలే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచారని చంద్రబాబు అన్నారు. పార్టీని నిలబెట్టింది, కాపాడింది బీసీలేనని పేర్కొన్నారు. బీసీలకు అగ్రస్థానం కల్పించాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు వరకు పోరాటం చేశామని గుర్తుచేశారు. అర్హతలకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు..