BT Naidu: నీ సలహాల వల్లే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పడిపోయారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జల కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదని, అలాంటి వ్యక్తి చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీటీ నాయుడు అన్నారు. మీరు స్వయంగా మాట్లాడుతున్నారా..? లేక ప్రజల చేత ఛీ కొట్టించుకుని తాడేపల్లి ఫ్యాలెస్‌లో బందీగా ఉన్న జగన్ రెడ్డి మీతో మాట్లాడిస్తున్నాడా..? అర్థం కావడం లేదు అని వ్యాఖ్యానించారు. ఈ రోజు సజ్జల మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని, సొంత పార్టీలోనే ఆయనపై ఛీ కొడుతున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా కూడా సజ్జలకి బుద్ధి, జ్ఞానం లేదా..? సొంత పార్టీ నాయకులే గత ప్రభుత్వాన్ని నాశనం చేసింది సజ్జలేనని బహిరంగంగా చెబుతున్నారు అని అన్నారు.
గత ప్రభుత్వ పాలనలో సజ్జల ప్రధాన సలహాదారుడిగా ప్రజల ధనాన్ని కాజేశారని ఆరోపించారు నాయుడు… జగన్ రెడ్డికి నువ్వు ఏం సలహాలు ఇచ్చావో తెలియదు కానీ, ఆ సలహాల వల్లే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. వైసీపీ నాయకులందరినీ గజగజ వణికిపోయే స్థితికి తీసుకువచ్చావు అని విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే పార్టీలో నీ హోదా ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ రోజు నీకు పార్టీ హోదా లేకుండా కూటమి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు మాట్లాడటం సరికాదన్నారు. అమరావతి గురించి సజ్జలకి అసలు ఏం తెలుసని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమరావతిని ‘భ్రమరావతి’, ‘శ్మశానం’ అంటూ మాట్లాడారని, ప్లాన్ ప్రకారమే రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ఈ రోజు మన పిల్లలను పరీక్షల్లో ఏపీ రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని పేరుతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారని, వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి రెండు అంకెల సీట్లే ఇచ్చారని అన్నారు బీటీ నాయుడు. అయినా కూడా సిగ్గు లేకుండా మాజీ సలహాదారుడు సజ్జలతో అమరావతి గురించి ప్రెస్ మీట్ పెట్టించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగన్ రెడ్డి దొంగ ముఠా అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను సందర్శించాలని హితవు పలికారు. వేల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. “కళ్లు ఉండి చూడలేని కబోదులు మీరు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ప్రజలను మభ్యపెట్టడం కోసమే, కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే సజ్జల మీడియా ముందుకు వచ్చారని బీటీ నాయుడు విమర్శించారు.