AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి

Ap Liquor Scam

Ap Liquor Scam

AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో ఛార్జిషీట్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో నిందితుడు ప్రణయ్ ప్రకాశ్ పాత్రకు సంబంధించిన పలు కీలక అంశాలను సిట్ వివరించింది. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం, వివిధ డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేసిన వ్యవహారంలో ప్రణయ్ ప్రకాశ్ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో అతను పలువురు వ్యక్తులతో కలిసి వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలిపింది.

అలాగే చెవిరెడ్డితో కలిసి విదేశీ పర్యటనలు చేసినట్లు, రాజ్‌ కేసిరెడ్డితో కలిసి విలాసవంతమైన జీవనం గడిపినట్లు సిట్ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. చార్టర్ విమానాల్లో ప్రయాణాలు చేయడంతో పాటు ఖరీదైన హోటళ్లలో బస చేసిన వివరాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన మరో కీలక అంశం ఏమిటంటే, మద్యం అక్రమ లావాదేవీల ద్వారా వచ్చిన నగదును రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు అపార్ట్‌మెంట్లలో దాచిపెట్టినట్లు సిట్ ఆరోపించింది. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకుని నగదు కట్టలను భద్రపరిచినట్లు ఛార్జిషీట్‌లో వివరించింది.

×
×
Ad

ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా వెలికితీసినట్లు సిట్ వెల్లడించింది. సేకరించిన ఆధారాలు, ఫొటోలు, డిజిటల్ డేటా ఆధారంగా సమగ్ర ఛార్జిషీట్‌ను సిద్ధం చేసి ఏసీబీ కోర్టులో సమర్పించినట్లు తెలిపింది. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, సిట్ దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్ ఈ కేసులో మరిన్ని కీలక అంశాలను వెలుగులోకి తీసుకురావచ్చనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది.