Site icon NTV Telugu

AP High Court: సర్కార్‌పై హైకోర్టు సీరియస్‌.. ఏంటి ఈ నిర్లక్ష్యం..!

Ap High Court

Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. గిరిజన ప్రాంతాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన ప్రాంతాల్లోని 595 గ్రామపంచాయతీలకు చెందిన 878 రెవెన్యూ గ్రామాల జాబితా ఇప్పటికీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ జాబితాను సరిహద్దులతో సహా వెంటనే గిరిజన సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

అయితే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఇప్పటికే ఈ 878 రెవెన్యూ గ్రామాల జాబితాను సిద్ధం చేసినప్పటికీ, దానిని అధికారికంగా ప్రచురించడం లేదని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు టి. వెంకట శివరాం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. జాబితా అందుబాటులో లేకపోవడంతో గిరిజన యువత, పేద కుటుంబాలు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందలేకపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని గిరిజనేతరులు షెడ్యూల్ ప్రాంతాల్లో సారవంతమైన భూములను ఆక్రమించడం, అక్రమ మైనింగ్, వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. షెడ్యూల్డ్ ఏరియాలపై స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల గిరిజనులకు రావాల్సిన భూములు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు దూరమవుతున్నాయని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 878 రెవెన్యూ గ్రామాల పూర్తి వివరాలను వెంటనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది.

Exit mobile version