Global Health Advisory Council: ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర ఆరోగ్య సేవల బలోపేతం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య రంగంలో వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పన కోసం 10 మంది అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులతో ఉన్నత స్థాయి సలహా మండలి ఏర్పాటు చేయనుంది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఇక, సలహా మండలి తొలి సమావేశం డిసెంబర్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరగనుంది. రాష్ట్ర ఆరోగ్య విధానాలకు దీర్ఘకాల దిశానిర్దేశం చేయడం, అమలు వ్యవస్థను శాస్త్రీయంగా బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.. ప్రభుత్వం గుర్తించిన 10 ప్రధాన ఆరోగ్య సమస్యలు.. లేదా వ్యాధుల కోసం ప్రత్యేకంగా ఒకో సలహా ఉప గ్రూప్ ఏర్పాటు చేయనుంది.
అయితే, వ్యాధుల నియంత్రణకు కీలక చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం.. వ్యాధుల నియంత్రణ వ్యూహాలు.. చికిత్సా ప్రమాణాలు.. డిజిటల్ హెల్త్ మానిటరింగ్.. వైద్యసేవల శిక్షణ మోడల్స్.. వంటి అంశాలపై మార్గదర్శకాలు అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ని గ్లోబల్ హెల్త్ హబ్‌గా మార్చడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.. ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ హబ్‌గా నిలపడం ప్రధాన లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ పేర్కొంటుంది..