Social Media Restrictions: సోషల్ మీడియా ప్రభావం చిన్నారులపై తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో, నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ఫేక్ న్యూస్, విద్వేషపూరిత పోస్టులు చేసే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో సోషల్ మీడియా నియంత్రణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GoM) సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. చిన్నారుల భద్రత, సమాజంలో శాంతి భద్రతలు, డిజిటల్ వేదికలపై బాధ్యతాయుత ప్రవర్తనకు మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరంపై మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది.
Read Also: Ajit Pawar: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కొత్త వీడియోలో షాకింగ్ విజువల్స్..
నిర్ణీత వయస్సు కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వకూడదన్న అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రుల బృందం సూచించింది. అలాగే, ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు మంత్రి నారా లోకేష్..
ఇక, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మలేషియాలో ‘మై డిజిటల్ ఐడీ’ ద్వారా ఈ-కేవైసీ అనుసంధానం చేసి 16 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తున్నారని వివరించారు. ఈ తరహా విధానాలను మన రాష్ట్రంలో అమలు చేయవచ్చా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మరోవైపు.. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టే వారితో పాటు, కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే హెబిచ్యువల్ అఫెండర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో సోషల్ మీడియా సంస్థల బాధ్యతను కూడా ఖరారు చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గూగుల్, మెటా, ట్విట్టర్ (ఎక్స్) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల కంప్లయన్స్ ఆఫీసర్లను వచ్చే మంత్రుల బృంద సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకునేందుకు ఐటీ యాక్ట్ సెక్షన్–46 ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ ఆఫీసర్‌ను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కొన్ని కేసుల్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సహయోగ్’ పోర్టల్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రుల బృందానికి వివరించారు. ఇక, కంప్యూటర్ రిలేటెడ్ నేరాలు, సైబర్ లా ఉల్లంఘనలు కట్టడి చేయడం, సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, సాంకేతిక నిపుణుల నియామకం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. డిజిటల్ వేదికలు సమాజానికి మేలు చేసేలా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు.