AP Collectors Conference: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండో రోజు కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరు, సంక్షేమ పథకాల అమలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కాపు కార్పొరేషన్ రుణాలు, కుటుంబ విధానాలు తదితర అంశాలపై సీఎం కీలక సూచనలు చేశారు. ఈరోజు ఆర్టీజీఎస్ (RTGS)పై సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే పథకాల అమలు తీరుపైనా సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. సాయంత్రం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
రెండు నిమిషాల్లోనే వివరాలు చెప్పాలి
కలెక్టర్ల సమావేశంలో అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు గంటపాటు సిద్ధమై వచ్చినా, అంశాన్ని రెండు నిమిషాల్లో వివరించమంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇకపై సమావేశాలన్నీ ఇదే విధంగా నిర్వహిస్తామని, అధికారులు సంక్షిప్తంగా, స్పష్టంగా విషయాన్ని వివరించేలా సిద్ధం కావాలని సూచించారు. ఎవరి సమయాన్ని మరొకరు వృథా చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
కాపు కార్పొరేషన్ రుణాలపై ప్రత్యేక దృష్టి
కాపు కార్పొరేషన్ రుణాల విషయంలో ఎక్కడైనా నిధులు అందుబాటులో ఉండి వినియోగించకుండా ఉంటే వెంటనే వాటిని ఉపయోగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిధులు అవసరమై అందుబాటులో లేకపోతే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైన నిధులను మంజూరు చేస్తానని స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్, సంక్షేమ పథకాలపై సమీక్ష
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమ పథకాల అమలుపై కూడా సమీక్ష జరిగింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేకంగా వెల్ఫేర్ క్యాలెండర్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఏ పథకం కింద ఏ తేదీన లబ్ధిదారులకు ప్రయోజనం అందిస్తున్నారో తేదీలతో సహా ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ప్రకటించడంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రయోజనాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
కులవృత్తులకు వాల్యూ అడిషన్
కులవృత్తులకు సంబంధించి ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. చేనేత, చేతివృత్తుల కేంద్రాలను కేవలం ఉత్పత్తి కేంద్రాలుగా కాకుండా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. తద్వారా ఆయా వృత్తులకు మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కుటుంబాల విభజనపై సీఎం కీలక వ్యాఖ్యలు
ఫ్యామిలీ మ్యాపింగ్ పేరుతో ఇళ్లను ఇష్టానుసారంగా విభజించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ విధానం ‘కంబైన్డ్ ఫ్యామిలీ’ అనే భావనపై ఆధారపడి ఉందన్నారు. పెద్ద కుటుంబాలకు ఎక్కువ ప్రయోజనాలు అందేలా విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సంక్షేమ పథకాల అమలులోనే కుటుంబాలను విభజించే పరిస్థితి ఏర్పడుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల సింగిల్ పర్సన్ కుటుంబాలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

