AP Cabinet Meeting: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉండగా, వీటి ద్వారా రాష్ట్రంలో 29,677 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 10 సంస్థల ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో సాంకేతిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక, కేబినెట్ అజెండా ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు సమగ్రంగా వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

