CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమై పలు కీలక అంశాలపై వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన సీఎం, డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లో ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం అన్ని వివరాలను ఇప్పటికే ప్రజలకు స్పష్టంగా వెల్లడించిందని సీఎం చెప్పారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. ఈ అంశంపై కోర్టులు కూడా వైసీపీకి చీవాట్లు పెట్టినా, దుష్ప్రచారం కొనసాగుతుండటం సరికాదన్నారు.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ పరామర్శలపై కూడా సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పరామర్శలకు వెళ్లిన ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, రైతుల పంటలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. పలువురు రైతులు తమకు నేరుగా సందేశాలు పంపి నష్టాన్ని వివరించారని పేర్కొన్నారు. దీంతో జగన్ పరామర్శలు అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. దిశా చట్టం అసలు చట్టరూపం దాల్చలేదని, అయినప్పటికీ దిశా పోలీస్ స్టేషన్లు, వాహనాల పేరుతో అప్పటి ప్రభుత్వం ప్రచారం చేసిందని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిశా బిల్లును తిరిగి పంపిందని గుర్తుచేశారు.

ఇదిలా ఉండగా, రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026’, ‘పీపీపీ పాలసీ-2026’ ముసాయిదాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించి మరింత పటిష్ఠమైన చట్టాలను తీసుకురావాలని నిర్ణయించింది. అదనంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల (UDAలు) పునర్వ్యవస్థీకరణ, పాదచారుల భద్రత పాలసీ-2026కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో “అమరావతి ఐ” పేరుతో పర్యాటక ప్రాజెక్టును ఏర్పాటు చేయడంతో పాటు, దాని పరిసరాల్లో గ్రీనరీ పార్కుల అభివృద్ధికి అవసరమైన భూ కేటాయింపులకు కూడా అనుమతి ఇచ్చింది. రానున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రూ.210 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పుష్కరాల నిర్వహణపై ఐదుగురు ఐఏఎస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.