AP High Court: విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ట్రైల్ కోర్టులో తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని నిందితులు హైకోర్టులో వేసిన పిటిషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్ అప్పీళ్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీరికి జీవిత ఖైదు విధింపును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు పంది వెంకట్రావును నిర్దోషిగా ధర్మాసనం ప్రకటించింది. ట్రైల్ కోర్టు వెంకట్రావుకు విధించిన జీవితఖైదును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
Read Also: Nagavamsi : వార్-2 దెబ్బకు షాకింగ్ నిర్ణయం తీసుకున్న నాగవంశీ
కాగా, 2010 జనవరి 30న పలగాని ప్రభాకర్ రావు కుమార్తె వైష్ణవిని విజయవాడలో కిడ్నాప్ చేసి నిందితులు హత్య చేశారు. గుంటూరు ఆటోనగర్ లో శారద ఇండ్రస్ట్రీలో విద్యుత్ కొలిమిలో మృతదేహాన్ని వేసి నిందితులు బూడిద చేసారు. కుమార్తె హత్య గురించి తెలిసి గుండె పోటుతో ప్రభాకర్ మరణించారు. విచారణ అనంతరం 2018 జూన్ 14న ఈ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు ఖరారు చేస్తూ విజయవాడ సెషన్స్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో నిందితులు వేరువేరుగా అప్పీళ్లు చేయగా విచారణ జరిపి కోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది..