AP Liquor Shops Tenders: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది.. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందుతున్నాయి.. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు 3396 మద్యం దుకాణాలకు మంగళవారం రాత్రి వరకు 41,348 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాల దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకు రూ. 826.96 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు చెబుతున్నారు.. అయితే, మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. మద్యం టెండర్ల షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తుండగా.. వారికి శుభావర్త చెబుతూ గడువు పొడగించే అవకాశం ఉందట..
దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు పలువురు దరఖాస్తుదారులు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేయనుంది ఏపీ ఎక్సైజ్ శాఖ.. 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వనున్నారు.. ఇక, ఈ నెల 14వ తేదీన మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు అధికారులు.. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. అయితే, గడువు పొడగించిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.. మొదట్లో మందకొడిగా సాగిన దరఖాస్తుల ప్రక్రియ.. చివర్లో ఊపందుకోవడంతో.. ప్రభుత్వానికి మద్యం టెండర్లు భారీగా ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి.. దరఖాస్తులకు గడువు పెంచే అంశం పైనా ప్రభుత్వంలో చర్చ సాగుతోంది.. ఇవాళ సాయంత్రానికి దరఖాస్తుల గడువు పెంచే అవకాశం ఉంది..