NTV Telugu Site icon

Ambati Rambabu: సీఎం వ్యాఖ్యలకు అంబటి కౌంటర్‌ ఎటాక్.. దీనికి బాధ్యుడు చంద్రబాబే..!

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు విషయంలో మరోసారి కూటమి సర్కార్‌.. వైసీపీ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో.. మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. పోలవరం పర్యటన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అనేక అబద్దాలు చెబుతున్నారు.. అసలు పోలవరాన్ని ప్రారంభించింది కట్టాలనుకున్నది దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని.. కానీ, పోలవరాన్ని తానే కడుతున్నట్లుగా చంద్రబాబు కథలు చెబుతున్నారు.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుని, బతిమిలాడి మేం కడతామని చెప్పి తీసుకున్నారు… ఇది చారిత్రాత్మక తప్పిదం అంటూ ఫైర్‌ అయ్యారు..

Read Also: Karnataka: ప్రభుత్వ ఉద్యోగి కంటే.. పానీ-పూరీ అమ్మేవాడే బెటర్!.. ఎందుకంటే..

స్పిల్ వే గేట్లు కూడా అమర్చామని అబద్ధం చెపుతున్నారు.. ఈ అబద్ధాలు వింటే ప్రజలు నవ్విపోతారు.. స్పిల్ వే పూర్తి చేసింది వైసీపీ, స్పిల్ వే గేట్లు పెట్టింది వైసీపీ.. ఒక రేకు తీసుకువచ్చి అక్కడ పెడితే, స్పిల్ వే గేట్లు అమర్చినట్లు కాదు అని హితవు చెప్పారు అంబటి రాంబాబు.. వైసీపీ చేసిన పనిని, మీరు చేసినట్లుగా చెబుతున్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ సైంటిస్టుల బృందం వచ్చింది.. 2014 – 19 మధ్య పోలవరం కట్టడంలో తప్పులు జరిగాయని, అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చిందన్నారు. అసలు, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణాలేంటి..? కాపర్ డ్యామ్‌లు కట్టకుండా, డయాఫ్రంవాల్ కట్టడం చారిత్రాత్మక తప్పిదం అన్నారు. మీరు చేసిన తప్పిదం వల్లే మళ్లీ 900 కోట్లతో డయాఫ్రం వాల్ కట్టాల్సి వస్తుంది.. దీనికి బాధ్యుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు.. అయితే, పచ్చి అబద్ధాలు ఆడే ప్రయత్నం చంద్రబాబు చేశారని దుయ్యబట్టారు.. టీడీపీ, చంద్రబాబు అసమర్థత, అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతిందన్న ఆయన.. నదిని డైవర్ట్ చేయకుండా ఏ దేశంలో నైనా ప్రాజెక్టులు కడతారా..? అని నిలదీశారు.. వేరే దేశాల్లో అయితే ఇలాంటి తప్పులకు ఉరి శిక్షలు వేస్తారు అని హెచ్చరించారు అంబటి రాంబాబు.

Read Also: Magical Stumping: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ఘటన.. మీరే చూసేయండి (వీడియో)

గతంలో పోలవరంలో అవినీతి జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీయే చెప్పారని వ్యాఖ్యానించారు అంబటి.. పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకుంటున్నారని చంద్రబాబుపై మోడీ ఆరోపించారు… పోలవరానికి నిధులు తెస్తుంటే, పొత్తుల పేరుతో వచ్చే నిధులుకు అడ్డం పడ్డారు.. కరోనా నేపథ్యంలో మూడు సంవత్సరాలు కూలీలు దొరకకపోయినా, ప్రత్యామ్నాయ మార్గాలలో, నదిని డైవర్ట్ చేసి ,స్పిల్ వే పూర్తి చేసిన ఘనత వైసీపీదే అన్నారు. చంద్రబాబు పోలవరాన్ని 2027కి పూర్తి చేస్తామని చెప్తున్నారు.. 2018 పూర్తి చేస్తామన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయి..? అని ఫైర్‌ అయ్యారు.. కేంద్రం మొదటి దశకు 12 వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది.. ఆ నిధుల విడుదల వెనక ఓ కుట్ర ఉంది.. 41.15 కు మాత్రమే ఈ ప్రాజెక్టును పరిమితం చేయడానికి చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు.. రెండవ దశ నిర్మాణాలు ఉండవు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎగ్గొట్టడానికి జరుగుతున్న కుట్ర ఇది అంటూ సంచలన ఆరోపణల చేశారు.. నిమ్మల రామానాయుడు పచ్చ చొక్కా వేసుకొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు.. చంద్రబాబు 100 అబద్ధాలు ఆడితే, నిమ్మల రామానాయుడు, 102 అబద్ధాలు ఆడుతున్నాడు.. ఇలాంటి అబద్ధాలు ఆడితే ప్రయోజనం లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..