రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రం నుంచి వంద శాతం ఓట్లు ద్రౌపది ముర్ముకే పడ్డాయి. మొత్తం 173 ఎమ్మెల్యేల ఓట్లు ఉండగా… అన్నీ ఒకే అభ్యర్థికి వేసిన రాష్ట్రంగా నిలిచింది ఏపీ. దేశంలో మరే రాష్ట్రం నుంచి వంద శాతం ఓట్లు ఒకే అభ్యర్థికి పడలేదు. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాయి.. దానికి అనుగుణంగానే ఓటు కూడా వేశారు.. దీంతో.. మొత్తం ఓట్లు గంపుగుత్తగా ముర్ముకే పడ్డాయి.. కాగా, భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయకేతనం ఎగురవేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై గ్రాండ్ విక్టరీ కొట్టారు.. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది చరిత్ర సృష్టించారు.. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ఆమె కావడం గమనార్హం.. ఇక, అంచనాలను నిజం చేస్తూ ఆమె విజయం సాధించినా.. అంచనాలకు అందని రీతిలో ఓట్లు సాధించారు.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాపై 2,96,626 విలువైన ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తంగా ద్రౌపది ముర్ముకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి.
Read Also: Modiji Kutch GST Hojaye: మోదీజీ కుచ్ జీఎస్టీ హోజాయే..! నగరంలో వెలసిన ఫ్లెక్సీలు
మొత్తం పోలైన 4,754 ఓట్లలో 4,701 ఓట్లు చెల్లాయి.. 3వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేప్పటికే ద్రౌపది ముర్ముకు 51 శాతం ఓట్లు రాడంతో విజయం ఖాయమైంది.. ఇక, యశ్వంత్‌సిన్హా తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. అయితే, పార్లమెంటు సభ్యులు, పార్లమెంటులో ఓటేసిన ఎమ్మెల్యేల ఓట్లను వేరుచేసి తొలిరౌండ్‌లో ఎంపీ ఓట్లను లెక్కించారు.. ఆ తర్వాత అక్షరక్రమంలో రాష్ట్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కగట్టారు.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పదేసి రాష్ట్రాల ఓట్లను ఒక్కో రౌండ్ కింద పరిగణనలోకి తీసుకొని లెక్కింపు పూర్తిచేశారు.. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే ఆంధ్రప్రదేశ్‌లో వందకు వందశాతం ఓట్లు వచ్చాయి.. ఏపీతో పాటు నాగాలాండ్, సిక్కింలలో ఒక్క ఓటు కూడా సాధించలేకపోయారు యశ్వంత్ సిన్హా.. అంతేకాదు విపక్షాల నుంచి భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది.. విపక్షాలకు చెందిన 17మంది ఎంపీలు, 125 మంది ఎమ్మెల్యేలు ద్రౌపదికి అనుకూలంగా ఓటు వేసినట్టు అంచనాలున్నాయి. ఎన్డీఏ అభ్యర్థికి ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో అత్యధిక ఓట్లు రాగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు పడ్డాయి.