విజయవాడలో ఏడాది క్రితం జరిగిన బిల్డర్ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది… విజయవాడ శివార్లలోని 61వ డివిజన్ పాయకాపురం దేవినేని గాంధీపురంలో హత్యకు గురైన బిల్డర్ పీతల అప్పలరాజు హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. మరుగున పడిపోయిన కేసులో అనుమానితుల్ని పోలీసులు మళ్లీ విచారించడంతో హత్య రహస్యం ఎట్టకేలకు బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయవాడ సింగ్‌నగర్ కృష్ణా హోటల్ ప్రాంతానికి చెందిన బిల్డర్ పీతల రాజు స్థానికంగా నిర్మాణరంగంలో ఉన్నాడు. 2021 నవంబర్ 1న ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమైనా నిందితులు ఎవరనేది మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇంట్లో మంచంపై నెత్తుటి మడుగులో పడి ఉన్న శవం దగ్గర ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు దర్యాప్తు అప్పట్లో ముందుకు సాగలేదు.. కానీ, ఎట్టకేలకు ఇప్పుడు కేస్‌ను క్లోజ్ చేశారు పోలీసులు..
Read Also: Gujarat Morbi Bridge: గుజరాత్ బ్రిడ్జి ఘటనలో 9మంది అరెస్ట్.. పోలీసుల దర్యాప్తు వేగవంతం
మూడేళ్ల క్రితం కుటుంబాన్ని విశాఖపట్నం తీసుకెళ్లి అక్కడే ఉంచిన రాజు.. విజయవాడ దేవినేని గాంధీపురంలో ఓ ఇంట్లోని పై అంతస్తులో ఒంటరిగా అద్దెకు ఉండేవాడు. విజయవాడలోనే ఉంటూ స్థానికంగా భవన నిర్మాణ కాంట్రాక్ట్‌లు చేసుకునే వాడు. ప్రతి 15, 20 రోజులకు ఓసారి విశాఖపట్నంలోని కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వస్తుంటాడు. విజయవాడలో రాజు కింది అంతస్తులో అతని సూపర్‌వైజర్‌గా పనిచేసే సాయికుమార్, భార్య సుధతో కలిసి అద్దెకు ఉండేవాడు. బిల్డర్ ఒక్కడే ఉంటుండడంతో సుధ వంట చేసి తీసుకెళ్లి ఇచ్చి వస్తుండేది. ఈ నేపథ్యంలో ఆమెను లైంగికంగా వేధిస్తుండేవాడు రాజు.. విషయం తెలుసుకున్న సుధ సోదరుడు భవానీశంకర్.. సాయికుమార్‌తో కలిసి హత్యకు పథకం రచించాడు. పీతల రాజును చంపేందుకు ఓ రౌడీషీటర్‌ను సంప్రదించారు. సుపారీ మొత్తం కుదరకపోవడంతో సొంతంగా చంపాలని నిర్ణయించారు. ఆలా గతేడాది అక్టోబరు 31న రాత్రి చేపల పులుసులో ఎలుకల మందును కలిపి, భోజనాన్ని పై అంతస్తులో ఉన్న రాజు గదికి సుధ తీసుకెళ్లి ఇచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు తలుపు లోపల గడియ వేయకుండా కిందకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో సుధ, సాయికుమార్, భవానీ శంకర్‌లు.. రాజు గదిలోకి వెళ్లి ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. ఆ హత్యను కప్పి ఉంచేందుకు దొంగల పనిగా సృష్టించడానికి మృతుని మెడలోని బంగారు గొలుసు, ఉంగరాలను మాయం చేసారు.
అయితే, ఈ కేసు విచారణలో పోలీసులకు చాల ఎదురు దెబ్బలే తగిలాయి.. ఒక్క క్లూ దొరకలేదు. అనుమానితుల్ని విచారించడంలో భాగంగా రాజు ఉండే కింది అంతస్తులో అతని వద్ద పనిచేసే సూపర్‌వైజర్ సాయికుమార్‌ను విచారించారు. వీరిని దాదాపు పది రోజుల పాటు వివిధ కోణాల్లో పోలీసులు ప్రశ్నించారు. దాంతో ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న సాయి కుమార్ విచారణ పేరుతో పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెడుతున్నారని అతని బంధువులతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో వారిని విడిచిపెట్టారు. ఇంతలో నే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రాజు రిపోర్ట్స్ రానే వచ్చాయి అందులో విషప్రయోగం జరిగిందని తేలింది. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు దర్యాప్తు అటకెక్కింది. కానీ, హత్య కేసు ఎటూ తేలకపోవడంతో మృతుని భార్య న్యాయం కావాలని గత రెండు నెలలుగా పోలీసుల చుట్టూ తిరగటంతో కేసు మళ్లీ మొదటికీ వచ్చింది. అప్పటికే సాయికుమార్‌పై అనుమానం ఉన్న పోలీసులు.. మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ఈసారి తమదైన శైలిలో ప్రశ్నించే సరికి.. అసలు విషయాన్ని బయటకు కుక్కాడు.. దీంతో, సుధా అండ్ బృందాన్ని మొత్తం విచారించారు.. అంత ఒప్పుకోవటంతో కటకటాల పాలయ్యారు.