National Lok Adalat: ఏపీ వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ స్పందన లభించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో శనివారం 380 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కరోజే ఏపీ వ్యాప్తంగా 94,263 కేసులు పరిష్కారం అయినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 87,805 పెండింగ్, 6,458 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నట్లు వివరించారు. ఆయా కేసుల పరిష్కారం ద్వారా అధికారులు రూ.93.07 కోట్ల పరిహారం అందజేశారు. రాజీకి అవకాశం ఉన్న పలు కేసుల్ని ఇరువర్గాల మధ్య సామరస్య పూర్వకంగా పరిష్కరించారు.
Read Also: Robbery in Nizamabad: మిఠాయి తినిపించి.. కాళ్లు, చేతులు కట్టేసి రూ.30వేలు దోపిడీ..
తూ.గో. జిల్లా పెద్దాపురం కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 320 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 21,క్రిమినల్ కేసులు 286, బ్యాంకు కేసులు 13 పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్ నిర్వహణకు మూడు బెంచ్‌లు ఏర్పా టుచేశారు. అటు అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ కె.సురేఖరెడ్డి లోక్ అదాలత్ బెంచ్‌లను నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న 451 కేసులు పరిష్కరించి రూ.3.34 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందజేశారు. కాగా లోక్ అదాలత్‌కు సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత కృతజ్ఞతలు తెలియజేశారు.