వివిధ రోగాలతో ఇబ్బంది పడుతున్నవారికి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. వాటిని వెంటనే ప్రారంభించారు.. ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను ఇప్పుడు 3,255కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. కొత్తగా 809 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చారు.. మే 2019లో ఆరోగ్య శ్రీకింద వైద్య చికిత్సల సంఖ్య కేవలం 1,059గానే ఉండగా.. అది క్రమంగా పెంచుతూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. జనవరి 2020లో 2059కి పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోగా.. వైద్యం ఖర్చు వేయి రూపాయల పైబడ్డ చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు.
Read Also: TTD: నవంబర్ 1 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ..
ఇక, జులై 2020లో 2200కు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్.. ఈ నిర్ణయం ద్వారా అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్ చికిత్స ప్రొసీజర్లు తెచ్చింది. ఆ తర్వాత నవంబర్ 2020లో ఆరోగ్యశ్రీ కిందకు వచ్చే రోగాల సంఖ్య 2,436కు పెరగగా.. బోన్ మ్యారోతో పాటు 235 ప్రొసీజర్లను చేర్చారు.. మే-జూన్ 2021లో 2,446కు ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య పెరగగా.. 10 కోవిడ్ ప్రొసీజర్లను చేర్చారు.. ఇక, 2022లో ఆరోగ్యశ్రీ కిందకు వచ్చే రోగాల సంఖ్య 3,255కు పెంచింది వైఎస్ జగన్ సర్కార్.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్ర, సేవా రత్న, ఉన్నత ఆరోగ్య సేవ అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..