3 Youngsters Enters In Pig Enclosure In Vizag Zoo: సోషల్ మీడియాలో లైక్స్ పొందేందుకు ఈమధ్య యువత ఏవేవో విన్యాసాలు చేస్తోంది. అందరికంటే భిన్నంగా తమ పోస్టులు ఉండాలన్న ఉద్దేశంతో హద్దులు మీరుతోంది. తాము చేస్తోంది సరైందా? కాదా? అని చూడట్లేదు. లైక్స్ వస్తాయి కదా.. అది చాలనుకొని బార్డర్ క్రాస్ చేస్తోంది. తాజాగా ముగ్గురు యువకులు బరి తెగించారు. వీడియో కోసమని ఏకంగా పందుల ఎన్‌క్లోజర్‌లోనే దూకేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్‌లోని జూ పార్క్‌ని సందర్శించడానికి వెళ్లిన ముగ్గురు యువకులు, అడవి పందుల ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లారు. అక్కడి వెళ్లి ఊరికే ఉండకుండా.. ఎన్‌క్లోజర్‌లోకి దూకారు. అడవి పందులు ఉన్న దిశగా కాస్త పరిగెత్తుకుంటూ వెళ్లారు. అంతే.. వాళ్లని చూసి భయపడ్డ అడవి పందులు, రివర్స్‌లో వాళ్ల మీద ఎటాక్ చేసేందుకు ఎగబడింది. ఓ యువకుడిపై దాడి చేసింది కూడా! పరిగెత్తుకుంటూ వెళ్తుండగా.. వెనక నుంచి కాళ్ల మధ్యలో దూరింది. దాంతో అతడు జారి, ఒక్కసారిగా పడ్డాడు. వెంటనే లేచి, బతుకు జీవుడా అంటూ వెంటనే ఎన్‌క్లోజర్ నుంచి బయటకొచ్చేశాడు. సరదా కోసమని ఏకంగా తమ ప్రాణాల్నే పణంగా పెట్టారు ఈ యువకులు.
నెట్టింట్లో వీడియో పోస్ట్ చేయడం, అది వైరల్ అవ్వడంతో.. వ్యవహారం సీరియస్‌గా మారింది. పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో ఆ యువకులు కటకటాల పాలయ్యారు. ఈ ఘటనపై జూ క్యురేటర్ నందిని సలారియా స్పందిస్తూ.. ‘‘జూ ఉన్నది జంతువులపై అవగాహన పెంపొదించుకోవడం కోసమే కానీ, ఇలాంటి అరాచకాలకు కాదు. ఇలాంటి నేరాలకు పాల్పడితే, 6 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వీటి వల్ల యువకుల జీవితాలు నాశనమవుతాయి. దీన్ని జూ సెక్యూరిటీ వైఫల్యంగానూ భావించి, సెక్యూరిటీ ఏజెన్సీకి నోటీసులు ఇవ్వడం జరిగింది’’ అని చెప్పుకొచ్చారు.