అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో పేరు మార్చాలని ఆందోళనలు, నిరసనలు జరగ్గా.. ఇప్పుడు పేరు మార్చొద్దంటూ కొందరు వ్యతిరేక గళం చాటుతుండటంతో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి వారం రోజుల పాటు కోనసీమ జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144 అమలు చేస్తు్న్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జిల్లాలోని అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, కాట్రేనికోన, రావులపాలెం మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎటువంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా పేరు మార్పు ఆందోళనల నేపథ్యంలో శాంతిభద్రతల కోసం 450 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.