అమరావతి ఐకాస రేపు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు. రాజధాని రైతుల ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి ఐకాస రేపు తలపెట్టారు. అదే సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ర్యాలీకి సిద్ధమయ్యారు. కాగా కొవిడ్ దృష్ట్యా ర్యాలికి అనుమతి సాధ్యం కాదని డీఐజీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం అనుమతులు సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. 50 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమని.. ఎవరికి వారు శిబిరాల్లో నిరసన కార్యక్రమాలు చేసుకోవచ్చు అని తెలిపారు. రెండు వర్గాల ర్యాలీతో శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. గొడవలు జరిగే అవకాశం ఉందని మాకు నిఘా వర్గాల సమాచారం అందింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి అనుమతి ఇవ్వము. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని డీఐజీ త్రివిక్రమ వర్మ హెచ్చరించారు.