ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది.. ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలకు నెలవు.. దేశంలోనే అతిపెద్ద తీరప్రాంతం దాని సొంతం.. ప్రపంచంలోనే భక్తులు అత్యధికంగా సందర్శించే శ్రీ ఏడుకొండల వేంకటేశ్వరస్వామి కొలువైన నేల.. పంచారామ క్షేత్రాలు, శక్తి పీఠం శ్రీశైల క్షేత్రం, కోదండ రామాలయం వంటి అనేక పుణ్యక్షేత్రాలు, అమరావతి స్తూపం, పలు ప్రదేశాలలో బౌద్ధ చైత్యాలు, స్తూపాలు, విశాఖపట్నం సముద్ర తీరం, అరకు లోయ, హార్స్‌లీ కొండలు, కోనసీమ డెల్టా లాంటి సహజ ఆకర్షణలు కలిగిన రాష్ట్రం.. వాయవ్యంగా తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో ఒడిషా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం.. కేంద్రపాలితప్రాంత భూభాగం పుదుచ్చేరికి చెందిన యానాం రాష్ట్రం హద్దులుగా కలిగి ఉంది..

దేశంలోనే 162,970 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఎనిమిదో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది ఏపీ.. గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల రెండవ పొడవైన తీరప్రాంతం కలిగిఉన్న రాష్ట్రం.. కోహినూర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు కోళ్లూరు గనిలో లభించాయి అంటే అథిశయోక్తి కాదు.. దేశ ప్రాచీన భాషలలో ఒకటైన తెలుగు దీని అధికార భాషగా ఉంది.. ఆంధ్రులు ఉత్తర భారతదేశంలో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆగ్నేయ భారతంలోని గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న ఆంధ్రుల పురాతన రాజ్యమని రామాయణ, మహాభారత పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు.. ఆంధ్రదేశానికి, భారతదేశానికి తొలి రాజులైన ఆంధ్రులు అని పిలవబడిన శాతవాహనులను ఆంధ్ర, ఆంధ్ర జాతీయ, ఆంధ్రభృత్య పురాణాలలో అనటం వలన కూడా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు..