హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ వేడిరాజుకుంటోంది. రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతోన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఎవరికీ వారు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ఓటర్లు ఏ పార్టీ మొగ్గుచూపుతారన్నది ఇప్పటీకీ క్లారిటీ రావడం లేదు. పోలింగ్ తేది వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా కన్పిస్తుంది. దీంతో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనేది మాత్రం ముందుగానే ఊహించడం కష్టంగా మారుతోంది.
టీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి ఈటల రాజేందర్ ఇక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు. వరుస ఎన్నికల్లో గెలుస్తూ హుజూరాబాద్ ను టీఆర్ఎస్ కు కంచుకోటగా మార్చివేశారు. అయితే టీఆర్ఎస్ నెలకొన్న అనుహ్య పరిణామాల నేపథ్యంలో ఈటల ఆపార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా ఇటీవలే ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.
సానుభూతి పవనాలు ఈటల రాజేందర్ కు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. హుజూరాబాద్ ప్రజలు గతంలో మాదిరిగానే తనను మళ్లీ ఆదరిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈటలకు అండగా బీజేపీ నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. తొలినాళ్లలో ఈటల రాజేందర్ గాలినే వీచింది. ఎక్కడ చూసినా ప్రజలు ఈటల రాజేందరే గెలుస్తారని చెబుతూ వచ్చారు.
అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయినట్లు కన్పిస్తుంది. ఎన్నిక ఆలస్యమవుతున్న కొద్ది ప్రజల్లో కొంతమార్పు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో బహిరంగంగా ఈటల రాజేందర్ గెలుస్తాడని చెప్పిన ఓటర్లు సైతం ఇప్పుడు సైలంట్ అవుతున్నారు. దీంతో ఆయన గెలుపు ఇక్కడ అంత ఈజీ కాదనే టాక్ విన్పిస్తుంది. అంతేకాకుండా ఈటల వెంట నడిచిన ముఖ్య నేతలంతా గులాబీ గూటికి చేరుతున్నారు. క్రమంగా ఆయన శిబిరం బలహీనమవుతోంది. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత, సానుభూతి పవనాలు కలిసివచ్చి ఈటల రాజేందర్ గట్టెక్కుతారని ఆయన అనుచరులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
హుజూరాబాద్ టీఆర్ఎస్ కు కంచుకోట. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం మొదలైట్టినా కరీంనగర్ జిల్లా నుంచే చేస్తూ వస్తున్నారు. ఈ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఇక్కడ ఈటల రాజేందర్ ఎంత బలంగా ఉన్నప్పటికీ కేసీఆర్ వ్యూహాలు మందు చిత్తు కావాల్సిందేననే టాక్ విన్పిస్తుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఆపరేషన్ ఆకర్ష్ షూర్ చేశారు. కేసీఆర్ డైరెక్షన్లో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ రంగంలోకి దిగి పని చేసుకుంటూ వెళుతున్నారు.
ఈటల రాజేందర్ వెంట వెళ్లిన టీఆర్ఎస్ నేతలను తిరిగి సొంతగూటికి రప్పిస్తున్నారు. ఈ విషయంలో వారు విజయం సాధించినట్లే కన్పిస్తుంది. అలాగే బీజేపీలోని కీలక నేతలకు సైతం ఆకర్షిస్తూ ఇటీవల గులాబీ కండువాలు కప్పుతున్నారు. దీంతో టీఆర్ఎస్ కొంత అప్పర్ హ్యండ్ సాధించిందనే టాక్ విన్పిస్తుంది. టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలనే తమను గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓటర్లు మునుపటిలా బహిరంగంగా ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. హుజూరాబాద్ లో ఏ పార్టీ గుజెండా ఎగురుతుందనేది తేలాలంటే మాత్రం నవంబర్ 2వ తేది వరకు ఆగాల్సిందే..!