టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ మధ్య అస్సలు కాలం కలిసి రావడం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయం బెడిసి కొడుతోందని సొంతపార్టీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ, అపార చాణిక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికలు ఛాలెంజ్ గా మారాయి. ప్రతిపక్షంలో ఉండటం టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో టీడీపీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకోవడం ఆయనకు మింగుడుపడటం లేదు. దీంతో జగన్ రెండోసారి అధికారంలోకి వస్తే టీడీపీ అనేది ఏపీలో అసలు ఉందా? అనే పరిస్థితి చేరుకోవడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఇదే తెలుగు తమ్ముళ్లలో ఆందోళనకు కారణమవుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలివాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్తలో టీడీపీ నేతలు ఓ రేంజులో రెచ్చిపోయారు. వీరిపై సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో అరెస్టులు మొదలుపెట్టడంతో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ గప్ చుప్ అయ్యారు. ఇదే సమయంలో ఏపీలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో నేతలంతా గప్ చుప్ అయ్యారు. ఇదే సాకుతో నేతలు ఇళ్లకు పరిమితం అయ్యారు. గత రెండేళ్లుగా పోరాటాలు, ప్రజా సమస్యలను పట్టించుకున్నా పాపాన పోలేదు. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. రాష్ట్రంలో ఒక్క జిల్లాలోనూ టీడీపీ కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడింది. ఇది ఇలానే కొనసాగితే టీడీపీ వచ్చే ఎన్నికల్లో మునగడం ఖాయమని గ్రహించిన చంద్రబాబు ఆపార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పార్టీని గాడిలో పెట్టాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక కార్యక్రమం చేయాల్సి ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన పాదయాత్ర లేదా సైకిల్ యాత్ర, బస్సు యాత్రలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిన్న, మొన్నటి వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర చేస్తే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని పార్టీ నేతలు కొందరు ఆయనకు సూచిస్తున్నారట. దీంతో ప్రత్యామ్నాయంగా బస్సు యాత్ర లేదంటే సైకిల్ యాత్ర చేయాలని భావిస్తున్నారు. తాను చేయడమే కాకుండా తన అనుచరులతో ఈ కార్యక్రమాలను చేయించేందుకు రెడీ అవుతున్నారు. తద్వారా అన్ని ఏరియాల్లోనూ టీడీపీని పుంజుకునేలా చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది.
ఇటీవల ఉత్తరాంధ్ర చర్చావేదిక పేరిట మూడు జిల్లాల టీడీపీ నేతలు విశాఖలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారంతా ఒక ప్లాన్‌ను తెరమీదికి తీసుకొచ్చారు. ఉత్తరాంధ్రలో టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు అప్పుడెలా ఉన్నాయి.. ఇప్పుడెలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఈ వ్యూహాన్ని వారంతా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. టీడీపీకి పూర్వవైభవం రావాలంటే మాత్రం ఏదో ఒక యాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఈమేరకు టీడీపీ త్వరలోనే ఏదో ఒక యాత్రకు శ్రీకారం చుట్టడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.