పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు సైతం గట్టిగా నిలదీయలేని సమస్యలపై ఆయన పోరాటం చేస్తూ ప్రజల్లోకి దూసుకెళుతున్న సంగతి తెల్సిందే. ఇక ఆపార్టీకి చెందిన ముఖ్య నేతల్లో నాదెండ్ల మనోహర్ ఒకరు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన పవన్ కల్యాణ్ వెంట నడుస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పెద్దగా ప్రభావం చూపకపోవడం ఆపార్టీకి మైనస్ గా మారింది.
ఈక్రమంలోనే వచ్చే ఎన్నికలపై జనసేన ఇప్పటి నుంచే దృష్టిసారించినట్లు కన్పిస్తుంది. కిందటి ఎన్నికల్లో మాదిరిగా కాకుండా ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తుంది. దీనిలో భాగంగానే జనసేన అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కమిటీని ప్రకటిస్తూ వెళుతోంది. మరోవైపు ఎక్కడెక్కడ జనసేనకు బలమైన గాలి వీస్తుందో అక్కడి స్థానాలపై ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుంటోంది. దీనిలో భాగంగా జనసేనకు చెందిన ముఖ్య నేతలు గతంలో ఓటమి పాలైన స్థానాల్లో కాకుండా వేరే నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేశారు. అయితే అనుహ్యంగా ఈ రెండుచోట్ల కూడా ఆయన ఓటమి పాలైయ్యారు. పవన్ కల్యాణ్ గతంలోనే రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి చివరి నిమిషంలో కోస్తా నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ తన సామాజికవర్గం ఓట్లతో ఆయన ఈజీగా గట్టెక్కుతారనే ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో అలాంటి ఫలితం రాలేదు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గం వేటలో పడ్డారు. విశ్వసనీయ సమాచారం ఆమేరకు ఆయన వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల్లో జనసేనాని విస్కృతంగా పర్యటించి ప్రజల నాడి తెలుసుకున్నారు. ఇక్కడ జనసేనకు అనుకూల పవనాలు వీస్తుండటంతో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జనసేన పార్టీకి గోదావరి జిల్లాలో బలం ఉన్నట్లు ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు చూస్తే అర్థం అవుతోంది. దీంతో ఇక్కడి నుంచి కూడా ఆయన పోటీ చేసే అవకాశం లేకపోలేదు. గతంలో మాదిరిగా ఆయన రెండుచోట్ల కాకుండా ఒకేచోట పోటీ చేయనున్నారు.
మరోవైపు జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ సైతం ఈసారి తన నియోజకవర్గాన్ని మార్చివేస్తారనే టాక్ విన్పిస్తుంది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గతంలో రెండుసార్లు పోటీ చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగిన ఆయన జనసేనలో చేరారు. ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. కిందటి ఎన్నికల్లో వైసీపీ వేవ్ కొనసాగడంతో నాదెండ్ల మనోహర్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఈ స్థానంలో వైసీపీ, టీడీపీ రెండు బలంగా ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తే గెలుపు అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది.
దీంతో ఆయన తెనాలి నుంచి మరోసారి పోటీ చేయాలా? లేదంటే కొత్త నియోజకవర్గం నుంచి బరిలో దిగాలా? అనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఆయన మరో నియోజకవర్గం వేటలో కూడా పడినట్లు తెలుస్తోంది. తెనాలి లేదంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచే అవకాశం ఉందనే టాక్ బలంగా విన్పిస్తోంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గుంటూరు కూడా ఒకటి. దీంతో ఈ రెండింటిలో ఏదో ఒక స్థానంలో ఆయన పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి జనసేన నేతలు గెలిచే నియోజకవర్గాలపై ఫోకస్ చేయడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.