మహిళలపై అత్యాచారాలు వెలుగుచూసిన సమయంలో చాలాసార్లు వాళ్లు ధరించే దుస్తులపై మీడియాలో చర్చలు జరుపడం చూస్తూనే ఉంటాం. ఒకవర్గం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచిస్తుంటారు… మరోవర్గం వారు ఏది కంఫార్ట్ గా ఉంటే అవే ధరించాలని వాదిస్తూ ఉంటారు. మధ్యేమార్గంగా మరికొందరు మహిళల ఇష్టాలను కాలారాసే శక్తి ఎవరికీ లేదని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారికే మంచిదని సూచిస్తూ ఉంటారు. ఇలా ఎవరికీవారు వారికి తోచినవిధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కేవలం మనదేశానికే పరిమితం కాకుండా అన్ని దేశాల్లోనూ ఈ జాడ్యం ఉంది.
ఒక్కో దేశంలో మహిళలు ఒక్కో రకంగా దుస్తులు ధరిస్తూ ఉంటారు. కొన్ని ముస్లిం దేశాల్లో అయితే ఏకంగా పై నుంచి కిందిదాకా బురాఖానే కన్పిస్తుంది. వారి జీవితం బురఖా చాటునే గడిచిపోతుంది. ఇది కేవలం ముస్లిం దేశాల్లోనే కాకుండా వేరే దేశాల్లో ఉన్నాయి. ఆఫ్రికా దేశాల్లో అయితే కనీసం వారి ఒంటి మీద కప్పుకునేందుకు దుస్తులు కూడా ఉండవు. వీటికి కొందరు రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు.
అలాగే ఆటలు ఆడేచోట, పర్యాటక ప్రదేశాలు, రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు వంటి చోట్ల మహిళల వేషధరణ ఢిపరెంట్ గా ఉంటుంది. ఇటీవల ఓ రెస్టారెంట్ కు ఓ మహిళ చీర కట్టుకొని వెళితే లోనికి రానివ్వలేదు. ఇది కాస్తా వివాదం కావడంతో ఏకంగా ఆ రెస్టారెంట్ నే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సంఘటనే తాజాగా యూరోపియన్ బీచ్ హ్యండ్ బాల్ పోటీలో కన్పించింది. ఈ పోటీలో పాల్గొనే అమ్మాయిలు బికినీలను ధరించాలి. యువకులు షార్ట్స్ ధరించాలనే నిబంధన ఉంది.
ఈ రూల్స్ ను నార్వే మహిళల హ్యాండ్ బాల్ జట్టు తాజాగా బ్రేక్ చేసింది. స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో నార్వే జట్టు మహిళలు బికినీలతో కాకుండా షార్ట్స్ తో పాల్గొన్నారు. తమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సదరు టీంపై యూరోపియన్ హ్యాండ్ బాల్ సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ 1500యూరోల ఫైన్ విధించింది. మన కరెన్సీలో దీని విలువ ఒక లక్షా 31వేలు. అయితే నార్వే హ్యాండ్ బాల్ ఫెడరేషన్ మాత్రం తమ జట్టు క్రీడాకారులకు మద్దతుగా నిలిచింది. వాళ్లు చేసిన పని తమకు ఎంతో గర్వకారణంగా ఉందంటూ సోషల్ మీడియాలో పేర్కొంది.
బీచ్ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొనే మహిళలు బికినీలు ధరించాలని నిబంధనను మార్చాలని గతంలోనే తాము కోరినట్లు నార్వే టీం చెబుతోంది. 2006లోనే ఈ వివాదాస్పద రూల్ పై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మగవాళ్లు మొకాళ్ల వరకు షార్ట్స్ ధరించేందుకు అనుమతి ఉందని వారు గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు మహిళలు షార్ట్స్ ధరిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా యూరోపియన్ హ్యాండ్ బాల్ సమాఖ్య ఈ వివాదస్పద రూల్ ను మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ఆ సమాఖ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే..!