2019 ఎన్నికల్లో ప్రారంభమైన వైసీపీ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అయితే టీడీపీ పరిస్థితి మాత్రం 2019 కంటే ఇంకా దయనీయంగా మారినట్లు కన్పిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట సైతం ఇప్పుడు ఆపార్టీ సత్తా చాటలేకపోవడం ఇందుకు నిదర్శంగా నిలుస్తుంది. టీడీపీకి కంచుకోటలుగా ఏరియాలు సైతం ఈ ఎన్నికల్లో బీటలువారినట్లు కన్పిస్తుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనమే కొనసాగింది. అధికారంలో ఉన్న పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపడం కామనే అయినప్పటికీ ఈ ఎన్నికల్లో టీడీపీ కనీస పోటీ ఇవ్వకపోవడం విడ్డూరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ టీడీపీ చతికిలపడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత పంచాయతీ ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ హవానే కొనసాగింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ కావడం చూస్తుంటే కుప్పంలో టీడీపీకి గడ్డుకాలం మొదలైనట్లు కన్పిస్తుంది.
కుప్పం టీడీపీకి కంచుకోటగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తూ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడి నుంచే విజయం సాధించి ఏపీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఆ జిల్లా క్రమంగా వైసీపీ చేతిలోకి వెళుతున్నట్లు కన్పిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 66 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీ గెలిచింది కేవలం మూడు స్థానాలే. వైసీపీ మాత్రం ఏకంగా నాలుగు జెడ్పీటీసీలతోపాటు 63ఎంపీటీసీలను కైవసం చేసుకుంది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా కుప్పంలో టీడీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, తాజాగా జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు చూస్తుంటే కుప్పంలో టీడీపీకి డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లు కన్పిస్తుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ సీటు సైతం వైసీపీ ఖాతాలోకి చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుప్పం కంటే మరో 12 నియోజకవర్గాల్లో టీడీపీ మంచి ఫలితాలను కనబర్చడం విశేషం.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గం కుప్పంతో పోలిస్తే కొంత బెటర్ అనిపించుకుంది. ఇక్కడ మొత్తం 78 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీ నాలుగు గెలిచింది. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తూ హిందూపురంలో మొత్తం 43 ఎంపీటీసీలు ఉండగా టీడీపీ ఏడుచోట్ల గెలిచింది. మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నియోజకర్గం పొన్నూరులో మొత్తం 53 స్థానాలుండగా టీడీపీ 12చోట్ల గెలిచింది. రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లులో 41 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11చోట్ల గెలిచింది. మొత్తంగా ఒక నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన అత్యధిక స్థానాలు 12 మాత్రమే. ఇవన్నీ కూడా కుప్పంతో పోలిస్తే కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాయి.
ఈ నియోజకవర్గాల్లోని నేతలు ప్రజలతో నిత్యం మమేకం అవుతుండటం వల్లే ఈ ఫలితాలు వచ్చినట్లు కన్పిస్తున్నాయి. కానీ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కరోనా వచ్చాక అసలు ఇంటి నుంచి బయటికి రావడమే మానేశారు. కుప్పం వైపు అసలు కన్నెత్తి చూడటం లేదు. అవసరమైతే తప్ప అక్కడి వెళ్లడం లేదు. దీంతో వారు సైతం దూరం పెడుతున్నారని ఈ ఫలితాల ద్వారా అర్థమవుతోంది.
బాలకృష్ణ సైతం హిందూపురానికి చుట్టపు చూపుగా వస్తున్నప్పటికీ అక్కడ టీడీపీ బలంగా పని చేసే కార్యకర్తలు ఉండటం ప్లస్ గా మారిందనే టాక్ ఉంది. ప్రజల్లో ఉండే నాయకుడికే ప్రజలు పట్టం కడుతారని మరోసారి ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేసినట్లు కన్పిస్తున్నాయి. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఇంటిగుమ్మం దాటి ప్రజాక్షేత్రంలోకి వస్తారో లేదో వేచిచూడాల్సిందే..!