పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. అబ్బాయిని చూడమని బంధువులు, సన్నిహితులకు చెబుతుంటారు. అయితే ఝార్ఖండ్ హజారీబాగ్‌కు చెందిన ఓ యువతి మాత్రం తన సంబంధం తానే చూసుకుంటోంది. తనకు ఎలాంటి వరుడు కావాలో చెబుతూ ఓ యువతి ఇచ్చిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని జెండా చౌక్ సమీపంలో నివసించే బంగాలీ దుర్గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, తనకు తగ్గ వరుడిని తానే వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పత్రికలో ప్రకటన కూడా ఇచ్చింది. ఆపై ఓ పెళ్లి వేడుకలో గోడలపైనా ఆ ప్రకటన అంటించింది. దీంతో ఆ వేడుకకు హాజరైన వారి దృష్టి దానిపై పడింది.
ఆ ప్రకటనలో తనకు ఎలాంటి వాడు కావాలో పూసగుచ్చినట్లు తెలిపింది. ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలి అంటూ రెండు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చింది. ఇంతకీ యువతికి ఏం క్వాలిటీస్ కావాలంటే.. అబద్ధాలు అస్సలు చెప్పకూడదట. పిసినారితనం ఉండకూడదు. ఏ కులానికి చెందిన వాడైనా అభ్యంతరం లేదు. మరీ ఎక్కువ చురుగ్గా ఉండనవసరం లేదు. కాస్త చురుగ్గా ఉంటే చాలు. నాకంటే చిన్నవాడైనా సరే ఆసక్తి ఉంటే సంప్రదించండి అంటూ సదరు యువతి వరుడి కోసం ఇచ్చిన ప్రకటన కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
