సాంకేతికంగా ప్రపంచం ఎంతగా అభివృద్ది చెందుతుంటే… అంతగా మూఢనమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి. రోగాలు నొప్పులకు నాటువైద్యం, పాము కరిస్తే కోడితో వైద్యం చేయడం చూశాం. అప్పట్లో దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాము కరిస్తే ఎవరైనా వైద్యుని వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షేర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల దేవేంద్రి పాముకాటుకు గురైంది. వంట చెరుకు సేకరణకు వెళ్లిన సమయంలో పాము కరిచింది. వెంటనే ఆ మహిళ పరుగుపరుగున ఇంటికి వచ్చి విషయాన్ని భర్తకు తెలియజేసింది.
Read: Wonder House: 6 అడుగుల స్థలంలో నాలుగంతస్తుల భవనం…
వెంటనే ఆ మహిళ భర్త దేవేంద్రిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పర్వతప్రాంతాల్లోని ఆవు పేడలను తీసుకొచ్చి అందులో ఆమెను పూడ్చిపెట్టాడు. ఆవుపేడలో అనేక ఔషదాలు ఉంటాయని, పాముకాటు నుంచి విషాన్ని బయటకు లాగేస్తుందని చెప్పడంతో ఆమె సరే అన్నది. ఆవుపేడతో ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పేయడంతో ఊపిరాడక ఆమె మరణించింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీ వంటి రాష్ట్రాల్లో మూఢనమ్మకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అవగాహన కల్పించి అరికట్టాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.