Today (31-01-23) Business Headlines:
హైదరాబాదులో అమెరికా సంస్థ
అమెరికా సంస్థ క్యూబిక్ ట్రాన్సుపోర్టేషన్ సిస్టమ్స్ మన దేశంలో కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాదులో ఆఫీసును ప్రారంభించింది. రానున్న రోజుల్లో 150 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. బస్సులు, ట్రైన్లు, మెట్రో రైళ్లు, పార్కింగ్, ఫైర్ కలెక్షన్ తదితర సర్వీసులకు ఒకే కార్డుతో పేమెంట్ చేసే వన్ అకౌంట్ టికెటింగ్ సేవలను అందించనుంది. ఈ సంస్థ ప్రస్తుతం బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రవాణా రంగ సంస్థలకు ఇంజనీరింగ్, సాఫ్ట్ వేర్, ఆన్ లైన్ పేమెంట్స్ సేవలను అందిస్తోంది.
ఫిజిక్స్-వాలాలో 2600 జాబులు
అన్ని సంస్థలూ లేఆఫ్’ల బాట పడుతుంటే ఎడ్-టెక్ యూనికార్న్ ఫిజిక్స్-వాలా మాత్రం రిక్రూట్మెంట్ ప్రకటన చేసింది. ఏప్రిల్ లోపు 2 వేల 500 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీలో ఇప్పుడు 6 వేల 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కొత్తగా.. బిజినెస్ డేటా అనలిస్టులు, కౌన్సిలర్లు, ఆపరేషన్స్ మేనేజర్లు, బ్యాచ్ మేనేజర్లు, టీచర్లను నియమించుకోనుంది. ఫిజిక్స్-వాలాకు పోటీ సంస్థలైన బైజూస్, అన్-అకాడమీ, వేదాంతు, ఫ్రంట్-రో.. ఉద్యోగులను తొలగిస్తుండగా ఈ సంస్థ మాత్రం హైరింగ్ ప్రకటన చేయటం చెప్పుకోదగ్గ విషయం.
బిర్లా సంస్థలోకి వారసుల ఎంట్రీ
మన దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థల్లో ఒకటైన బిర్లా గ్రూపులోకి వారసులు రంగ ప్రవేశం చేశారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ బోర్డులోకి కుమార మంగళం బిర్లా ఇద్దరు పిల్లలు ఎంట్రీ ఇచ్చారు. అనన్యశ్రీ బిర్లా, ఆర్యమన్ బిర్లా.. అడిషనల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. బోర్డు అంగీకరించిన ఈ నియామకాలకు షేర్ హోల్డర్లు కూడా ఆమోదం తెలపాల్సి ఉంది. అనన్యశ్రీ బిర్లా.. స్వతంత్ర మైక్రోఫిన్ అనే రుణ సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు. ఆర్యమన్ బిర్లాకు ఎంట్రప్రెన్యూర్షిప్, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, క్రీడాంశాల్లో పూర్వానుభవం ఉంది.
హైదరాబాదులో NHRD సదస్సు
హైదరాబాద్ మరో విశేష సదస్సుకు వేదిక కాబోతోంది. జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ 25 వార్షిక సమావేశాలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నగరంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ‘ఆర్థికాభివృద్ధి-భవిష్యత్ ముఖచిత్రం’ అనే అంశంపై ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ మీటింగులో వెయ్యి మందికి పైగా HR ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ విషయాలను NHRD హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ విపుల్ సింగ్ తెలిపారు.
శుక్రవారం ప్రభుత్వ బాండ్ వేలం
పదేళ్ల వ్యవధి గల కొత్త ప్రభుత్వ బాండ్’కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం వేలం నిర్వహించనుంది. ఇందులో భాగంగా 3 సెక్యూరిటీలను విక్రయించటం ద్వారా 28 వేల కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ సెక్యూరిటీల్లో 12 వేల కోట్ల రూపాయల విలువైన పదేళ్ల బాండ్ పేపర్ ఒకటి ఉంది. ఇది 2033వ సంవత్సరంలో మెచ్యూర్ అవుతుంది. ఇండియన్ ఎకానమీలో కార్పొరేట్ డెట్ వంటి క్రెడిట్ ప్రొడక్టులకు గవర్నమెంట్ బాండ్లను ప్రైసింగ్ రిఫరెన్సుగా తీసుకునే సంగతి తెలిసిందే.
2.5 కోట్లకు ‘మారుతీ’ విక్రయాలు
మారుతీ సుజుకీ సంస్థ మన దేశంలో ఇప్పటివరకు విక్రయించిన వాహనాల సంఖ్య రెండున్నర కోట్లకు చేరింది. ఈ నెల 9వ తేదీ వరకు జరిగి సేల్స్ వివరాలను నిన్న సోమవారం వెల్లడించింది. జపాన్’కు చెందిన ఈ సంస్థ ఇండియాలో మొదటి కారు మారుతీ-800ను 1983 డిసెంబర్’లో విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశంలో 17 మోడళ్లను ఉత్పత్తి చేసి అమ్ముతోంది. ఇటీవలి కాలంలో SUVలతో పోర్ట్’ఫోలియోను బలోపేతం చేసుకుంటోంది. హైబ్రిడ్, CNG మోడళ్లకు సైతం విస్తృత ప్రజాదరణ కల్పించే ప్రయత్నాల్లో ఉంది.