Today (19-01-23) Business Headlines
హైదరాబాద్ స్టార్టప్.. అరుదైన గుర్తింపు
హైదరాబాదులోని ఫిన్-టెక్ స్టార్టప్ సంస్థ MicroNsure Consultancyకి నేషనల్ అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి గాను బీమా విభాగంలో ఈ పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని కంపెనీ ఫౌండర్ అండ్ CEO కమలాకర్ సాయి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ MicroNsure Consultancy ఏర్పాటు లక్ష్యాలను వివరించారు. ప్రపంచంలోని అత్యంత అర్హులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ దిశగా స్థిరమైన ఉత్పత్తులను మరియు ప్రక్రియలను నిర్మిస్తున్నామని తెలిపారు.
‘మీనాక్షి’ ఇప్పుడు.. ‘వేదాంతా’ సొంతం
ఏపీలోని నెల్లూరులో వెయ్యి మెగా వాట్ల బొగ్గు ఆధారిత పవర్ ప్లాంటును కలిగిన మీనాక్షి ఎనర్జీ సంస్థను వేదాంతా లిమిటెడ్ కంపెనీ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 14 వందల 40 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని స్టాక్స్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు. నిండా అప్పుల్లో కూరుకుపోయిన మీనాక్షి ఎనర్జీని దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా ఇతర సంస్థలతో పోటీ పడి చేజిక్కించుకున్నట్లు వేదాంతా తెలిపింది. ఇదిలాఉండగా ఈ కొనుగోలు ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.
మారుతీ కార్ల ‘రివర్స్’ గేర్.. రీకాల్..
కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ రివర్స్ గేర్ వేసింది. 17 వేల 362 కార్లను రీకాల్ చేసింది. ఆ కార్లలో ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్ సంబంధిత లోపాలను చెక్ చేసి లోటుపాట్లు ఉంటే ఉచితంగా రీప్లేస్ చేసి ఇస్తామని ప్రకటించింది. గత నెల 8వ తేదీ నుంచి ఈ నెల 12వ తేదీ మధ్యలో తయారైన వివిధ మోడల్ కార్లకు ఈ రీకాల్ వర్తిస్తుందని తెలిపింది. ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాంట్ విటారా మోడల్ కార్లను ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్ మార్చే వరకు వాడొద్దని సూచించింది.
ప్రపంచానికి లీడర్ కానున్న ఇండియా
వివిధ అంశాల్లో ప్రపంచాన్ని ముందుండి నడిపించే సత్తా మన దేశానికి ఉందని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. ఆరోగ్యం, సంరక్షణ, పర్యాటకం వంటి విషయాల్లో ఇండియాకి అద్భుత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ దిశగా ఇండియా అనే టాపిక్ మీద వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. సప్లై చెయిన్ సహా పలు విభాగాల్లో ఇండియా ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా వ్యవహరించగలదన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో భారతదేశం విశేష పనితీరును కనబరుస్తోందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
రూ.20 వేల కోట్ల FPOకి ‘అదానీ’ అప్లై
అదానీ ఎంటర్-ప్రైజెస్ లిమిటెడ్ దేశంలోనే అతి పెద్ద ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కోసం అప్లై చేసింది. తద్వారా 20 వేల కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణ పెట్టుబడిదారుల కోసం నిర్వహిస్తున్న ఈ FPO ఈ నెల 27వ తేదీన ప్రారంభమై 31వ తేదీన ముగుస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన దరఖాస్తులో వెల్లడించింది. ‘షేర్ వ్యాల్యూ రేంజ్’ని 3 వేల 112 రూపాయల నుంచి 3 వేల 276 రూపాయల వరకు నిర్ణయించింది. ఇది దేశంలోని 3వ అతి పెద్ద పబ్లిక్ ‘ఆఫర్’గా నమోదుకానుందని చెబుతున్నారు.
AI స్వర్ణ యుగంలోకి ప్రపంచ దేశాలు
ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనే స్వర్ణ యుగంలోకి ఎంటరవుతున్నాయని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల తెలిపారు. ఈ రంగంలో ఇటీవల తెర మీదికి వచ్చిన ఉత్పత్తుల్లో ChatGPT అందరి దృష్టిని ఆకర్షిస్తోందని, ప్రతిఒక్కరిలో ఉద్వేగాన్ని నింపుతోందని చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన వార్షిక సమావేశంలో ప్రసంగించారు. ప్రపంచ ప్రజలను మరిన్ని మార్గాల్లో మరింత దగ్గర చేసేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుందని వివరించారు.