Today (14-01-23) Business Headlines:
ఫారెక్స్ తగ్గింది.. పసిడి పెరిగింది..
ఇండియాలోని విదేశీ మారక నిల్వలు మరోసారి తగ్గాయి. తాజాగా 126 కోట్ల డాలర్లకు పైగా క్షీణించాయి. ఫలితంగా 56 వేల 158 కోట్ల డాలర్లకు చేరాయి. రూపాయి విలువను రక్షించేందకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ రిజర్వులను వెచ్చిస్తుండటంతో అవి నేల చూపులు చూస్తున్నాయి. ఇది ఈ నెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారం. ఒక వైపు.. విదేశీ మారక నిల్వలు తగ్గుతుంటే.. మరో వైపు.. బంగారం నిల్వలు పెరుగుతుండటం విశేషం.
హెరిటేజ్ రైట్స్ ఇష్యూ 30న స్టార్ట్
హెరిటేజ్ ఫుడ్స్ ఈ నెల 30వ తేదీన రైట్స్ ఇష్యూను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా 5 రూపాయల ఫేస్ వ్యాల్యూ కలిగిన 4 కోట్ల 63 లక్షల 98 వేల షేర్లను జారీ చేయనుంది. తద్వారా 23 కోట్ల 19 లక్షల రూపాయల నిధులను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. షేర్ల జారీకి ఈ నెల 20ని రికార్డు డేటుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రైట్స్ ఇష్యూ ఫిబ్రవరి 18వ తేదీన ముగుస్తుంది.
క్యాన్సర్ మందు హక్కులు ‘రెడ్డీస్’కి
ఇండియాలో రొమ్ము క్యాన్సర్ మందు తయారీ మరియు విక్రయ హక్కులను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ దక్కించుకుంది. హైదరాబాదుకు చెందిన ఈ ప్రముఖ ఫార్మా సంస్థ.. ఫైజర్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ ‘‘ట్రేడ్ మార్క్’’ రైట్సును సొంతం చేసుకుంది. పాల్-బోసిక్లిబ్ అనే ఈ ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్.. మార్కెట్ రేట్ కన్నా 85 శాతం తక్కువ ధరకు అమ్మనుండటం గమనించాల్సిన విషయం. ఈ ‘మెడిసిన్’కి సంబంధించిన మార్కెటింగ్ బాధ్యతలను గతేడాది మే నెల నుంచే డాక్టర్ రెడ్డీస్ నిర్వహిస్తోంది.
దిగొచ్చిన ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం 2022 ‘డిసెంబర్’లో ఏడాది కనిష్టానికి అంటే.. 5 పాయింట్ ఏడు రెండు శాతానికి దిగొచ్చింది. ఆహార ద్రవ్యోల్బణం ‘నవంబర్’లో 4 పాయింట్ ఒకటీ తొమ్మిది శాతంగా నమోదు కాగా ‘డిసెంబర్’లో 4 పాయింట్ ఆరు ఏడుగా నమోదైంది. కూరగాయలు, నూనెలు, మాంసం, చేపల ధరలు సైతం తగ్గటంతో సామాన్యులు ఊరట పొందారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ‘అక్టోబర్’లోని 4 శాతం నుంచి ‘నవంబర్’లో 7 పాయింట్ 1 శాతానికి పెరిగింది.
రికార్డు స్థాయికి గోల్డ్ రేట్
బంగారం ధర రికార్డు స్థాయిలో పలికింది. 10 గ్రాముల గోల్డ్ రేటు 56 వేల 260 రూపాయలకి చేరింది. నిన్న శుక్రవారం దేశవ్యాప్తంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 190 రూపాయలు పెరిగింది. గ్లోబల్ మార్కెట్లలో కూడా గోల్డ్ 9 నెలల గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతోంది. 31 పాయింట్ 10 గ్రాముల రేటు 19 వందల 5 పాయింట్ ఒకటీ తొమ్మిది డాలర్లకు పెరిగింది.
అందరి చూపు.. SUVల వైపు..
గ్రేటర్ నోయిడాలో కొనసాగుతున్న ‘Auto Expo-2023’లో అందరి చూపు టాన్ టెన్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ పైనే ఉంది. వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ SUVల జాబితాను ఒకసారి చూద్దాం.. లెక్సస్ ఎల్‌ఎక్స్ 500డి, లెక్సస్ ఆర్‌ఎక్స్, మారుతీ సుజుకీ బ్రెజ్జా సీఎన్‌జీ, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్, మారుతీ సుజుకీ జిమ్నీ, ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్, టాటా హ్యారియెర్ ఈవీ, టాటా సియెర్రా ఈవీ, టాటా హ్యారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300.