తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక ఆరోగ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి అని అన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ. రెండు రోజుల క్రితం కేంద్రం అడిగిన దాని కన్నా ఎక్కువ ఆక్సిజన్ మంజూరు చేసిందన్న ఆయన నిన్న మాట మార్చడం ఆయన మతి భ్రమించిందా అన్న సందేహాలకు తావిస్తోంది. లేక సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో ఈటల రాజేందర్ కు పదవీ గండం ఉందని వస్తోన్న వార్తలకు భయపడి, తన పదవి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, బిజెపిపై నిందలు మోపుతున్నట్టు భావించాల్సి వస్తోంది. మనుగడ కోసం పోరాటంలో భాగంగానే ఆయన వ్యాఖ్యలను చూడాల్సి వస్తోంది. సీఎం కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవాలన్న సోయి తప్పితే కరోనా పరిస్థితిపై అవగాహనతో మాట్లాడినట్టు ఎక్కడా అనిపించలేదు. గడియకో మాట మార్చడం వల్ల తన గౌరవమే తగ్గుంతుదని, ప్రజలు ఆయన అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదని గ్రహిస్తే మంచిది. ఇదే తరహాలో కొనసాగితే సీనియర్ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన మీద ఉన్న గౌరవం, సానుభూతి పోయి ప్రజల మధ్య చులకన అవడం ఖాయం.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయనకు రాష్ట్ర వైద్య రంగంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా..? ఈటల ప్రమేయం లేకుండా సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ ఇతర అధికారులే వ్యవహారం మొత్తం నడిపిస్తున్నారు. మొత్తం పరిస్థితిని వారే పర్యవేక్షిస్తున్నారు. కరోనాపై చేపట్టిన ఒక్క సమీక్షలోనైనా ఈటల రాజేందర్ పాల్గొన్నారా? సీఎస్ సోమేష్ కుమార్ తో ఒక్కసారైనా చర్చించారా? వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఒక మాట చెప్తున్నారు, ఆరోగ్య మంత్రి మరో మాట చెప్తున్నారు. డీఎంఈ, డీహెచ్ఎస్ తో తనకు అసలు సంబంధాలున్నాయా..? అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం, సీఎస్ సహా స్వయంగా ఆ మంత్రిత్వ శాఖ అధికారులే పరిగణనలోకి తీసుకుంటున్నట్టు అనిపించడం లేదు. ఏదో ఉనికి కోసం ప్రతి రోజూ దవాఖానాల పొంటి తిరుగుతున్నారు కానీ కరోనా పరిస్థితిపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని స్పష్టమవుతోంది. కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకే దిగజారుడు రాజకీయాలకు పోయి ప్రధాని మోదీపై, బిజెపిపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ అభాసుపాలవుతున్నారు. ప్రజల మధ్య పలచనవుతున్నారు. ఇప్పటికైనా తన తప్పు సరిదిద్దుకొని, భూమి మీదకు వచ్చి వాస్తవాలు మాట్లాడితే మంచిది.
కేంద్రం నుంచి తెలంగాణకు ఏమొస్తున్నాయో అసలు ఈటల రాజేందర్ కు తెలుసా..? రోజుకు 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తయ్యేలా కేంద్రం ఏర్పాట్లు చేసిన విషయం తెలుసా..? పీఎం కేర్స్ నిధుల నుండి రాష్ట్రం 5 పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తున్న విషయం తెలుసా..? ఇలాంటి మరో 12 ప్లాంట్లు మంజూరైన విషయం తెలుసా..? 1000 డి టైపు ఆక్సిజన్ సిలిండర్లు పంపించిన విషయం తెలుసా..? తెలంగాణకు మెడికల్ ఆక్సిజన్ సత్వరం అందించేందుకు రాష్ట్రానికి యుద్ధ విమానాలు పంపించిన విషయం తెలుసా? ‘‘ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్’’ ద్వారా మెడికల్ ఆక్సిజన్ ను రాష్ట్రానికి రవాణా చేస్తోన్న విషయం తెలుసా? తెలంగాణకు 48 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపించిన విషయం తెలుసా? 1400 వెంటిలేటర్స్ పంపించిన విషయం తెలుసా? రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రెండెసివర్ వయల్స్ పంపిస్తున్న విషయం తెలుసా? మే, జూన్ నెలల్లో పేదలక పంపిణీ చేసేందుకు కేంద్రం ఉచితంగా 1,91,621 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందించనున్న విషయం తెలుసా..? ఇవేవీ తెలీకుండానే ఈటల రాజేందర్ మాట్లాడారనుకోవాలా లేక కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారనుకోవాలా..? ఉనికి కోసం ఆరాటపడుతూ రాష్ట్రంలోని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ఈటల రాజేందర్ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలకు స్పష్టతనివ్వాలి. సీఎం కేసీఆర్ ఆయనను పరిగణనలోకి తీసుకోరు, సీఎస్ సోమేష్ కుమార్ ఆయనతో మాట్లాడరు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆయన మాట పట్టించుకోరు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా ఆయనతో పెద్దగా ఉపయోగం లేదు. ఈటల రాజేందర్ తన సేవలు చాలించి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది.