బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చింది ఉత్తరాది భామ దిగంగనా సూర్యవంశీ. పలు హిందీ సీరియల్స్ లో నటించడమే కాకుండా బిగ్ బాస్ షోలోనూ పాల్గొని పాపులారటీ పొందింది దిగంగనా. టాలీవుడ్ లోకి దిగంగనా ‘హిప్పీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కార్తికేయ సరసన నటిస్తూ అందాలు ఆరబోసి, కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. దాంతో సహజంగానే సినిమా విజయం సాధించకపోయినా దిగంగనాకు ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. ‘వలయం’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘సీటీమార్’లోనూ చోటు దక్కించుకుంది. విశేషం ఏమంటే… ఇటీవల దిగంగనాపై ఓ నెమలి దాడి చేసింది. మీరు చదివింది నిజమే… ఈ అందాల భామపై మరో మయూరి దాడి చేసింది. ఓ చోట హాయిగా సేదతీరుతున్న నెమలి దగ్గరకు వెళ్ళి దిగంగనా నిల్చుని, దాని అందాలను ఆస్వాదిస్తోంది. మరి తన ఏకాంతాన్ని ఈ కాంత భగ్నం చేసిందనే కోపం వచ్చిందో ఏమో నెమలి అమాంతగా దిగంగనా మీదకెగిరి కాలి గోళ్ళతో రక్కేయబోయింది. భయంతో దిగంగనా వెనకడుగు వేసి ఆ దాడి నుండి తప్పించుకుంది. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయిపోతోంది. సో… అందంగా పురివిప్పి నాట్యం చేసే నెమలి సాధుజంతువు అని దాని దగ్గరకు వెళ్ళడం యమా డేంజర్!!