‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ కన్ ఫామ్ కావడంతో ఇప్పుడు వరుసగా పలువురు బడా నిర్మాతలు తమ చిత్రాల విడుదల తేదీలను రీ షెడ్యూల్ చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఆ మరు క్షణమే తమ ‘ఎఫ్ 3’ మూవీ ఏప్రిల్ 28న రాబోతోందని ‘దిల్’ రాజు తెలిపారు. ఇదిలా ఉంటే… పవన్ కళ్యాణ్, రానాతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘భీమ్లా నాయక్’ కోసం ఏకంగా రెండు డేట్స్ ను బ్లాక్ చేసి పెట్టారు. అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తే… ముందు అనుకున్నట్టు ఫిబ్రవరి 25న మూవీని విడుదల చేస్తామని, లేదంటే ఏప్రిల్ 1న జనం ముందుకు తీసుకొస్తామని నిర్మాత ప్రకటించారు.
ఇదిలా ఉంటే చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ చిత్రాలు రెండూ ఒక్క రోజు తేడాతో వస్తాయా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అలానే ‘ట్రిపుల్ ఆర్’ చిత్రాన్ని ముందు చెప్పినట్టుగా మార్చి 18, ఏప్రిల్ 28న కాకుండా రాజమౌళి బృందం మార్చి 25న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించినట్టుగానే, ‘భీమ్లా నాయక్’ సైతం మరో డేట్ లో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. మొత్తం మీద ఒక్కసారిగా ఈ పెద్ద సినిమాల విడుదల తేదీలను ప్రకటించడంతో టాలీవుడ్ లో చర్చోపచర్చలు మొదలయ్యాయి.