పర్యావరణంలో రోజురోజుకు అనేక మార్పులు వస్తున్నాయి. భూమిపై వేడి పెరిగిపోతున్నది. వాతావరణంలో వేడి పెరగడం వలన ధృవప్రాంతాల్లో మంచు విపరీతంగా కరిగిపోతున్నది. ఎప్పుడూ లేని విధంగా అర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లోని మంచు భారీస్థాయిలో కరుగుతున్నది. వేడికి గ్లేసియర్లు కరిగి సముద్రంలో కలిసిపోవడంతో నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై నాసా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. వీరి పరిశోధనల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. నసా పరిశోధనల ప్రకారం 2100 నాటికి ఇండియాలోని 12 నగరాలు, పట్టణాలు 2.7 అడుగుల మేర మునిగిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాండ్లా, ఓఖా, భావ్నగర్, ముంబై, మార్ముగావో, మంగళూరు, కొచ్చిన్, పారాదీప్, ఖిదర్పూర్, విశాఖపట్నం, చెన్నై, ట్యూటికోరిన్ తదితర నగరాలు, పట్టణాలు 2.7 అడుగుల మేర మునిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.